పెళ్లి పత్రికలు పంచి వస్తూ.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి పత్రికలు పంచి వస్తూ..

Mar 8 2026 7:24 AM | Updated on Mar 8 2026 7:24 AM

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ దుర్మరణం

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇచ్ఛాపురం రూరల్‌: వరుసకు తమ్ముడు పెళ్లిని ఘనంగా జరిపించాలనే ఆనందంతో సెలవు తీసుకొని గ్రామానికి వచ్చిన ఓ జవాన్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇచ్ఛాపురం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కంచిలి మండలం బొనమాలి గ్రామానికి చెందిన బడ్డి బాలకృష్ణ(28) ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. పెద్దనాన్న కుమారుడు, వరుసకు తమ్ముడైన చంద్రశేఖర్‌ వివాహం సందర్భంగా సెలవుపై శుక్రవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ఒడిశా రాష్ట్రం జయంతిపురం, పాత్రపురం, సామంతపల్లి ప్రాంతాల్లో బంధువులు ఉండటంతో వారిని పెళ్లికి ఆహ్వానించేందుకు తమ్ముడు బడ్డి సర్వేశుతో కలిసి శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. పెళ్లి కార్డులు అందించి తిరిగి వస్తుండగా కొత్త శాసనాం హనుమాన్‌ ఆలయం వద్దకు వచ్చే సరికి ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామానికి చెందిన యువకుడు రామిశెట్టి దిలీప్‌ అదే రోడ్డు గుండా ఒడిశా వెళ్తూ రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆర్మీ జవాన్‌ బాలకృష్ణ తలకు బలంగా దెబ్బ తగలగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెరో బైక్‌పై ఉన్న సర్వేశు, దిలీప్‌లు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు 108లో ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణకు ఏడాది క్రితం బాడపల్లి గ్రామానికి చెందిన శృతితో వివాహం జరిగింది. ఇంతలోనే మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు పార్వతి, దుర్యోధనలతో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని శవపంచనామాకు ఇచ్ఛాపురం సీహెచ్‌సీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై జనార్దనరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement