రాయగడ: జిల్లాలోని చంద్రపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సంభవించింది. ఈ ప్రమాదంలో తాగునీటి మెగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. చంద్రపూర్‌లోగల డెఫ్పావీధిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చుట్టు పక్కల గల పూరి గుడిసెలకు చెందిన వారు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంతవరకు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదపు చేయగలిగారు. ఈ ప్రాంతంలో ప్రజల తాగునీటి సౌకర్యార్థం ప్రభుత్వం మెగా తాగునీటి ప్రాజెక్టు పనులను నిర్వహిస్తుంది. అందుకు సంబంధించిన ప్లాస్టిక్ పైపులను డెప్పాగుడ ప్రాంతంలొ డంపింగ్ చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా లక్షల రూపాయలు విలువ చేసే పైపులు మంటలకు దగ్ధమైనట్లు ప్రాథమిక అంచనా కింద సంబంధిత శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్లాస్టిక్ పైపులు కావడంతో మంటలను అదుపు చేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అసలు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నామని అగ్నిమాపక అధికారులు వివరించారు.


