రాయగడ: పత్రికా స్వేచ్ఛను భంగం కలిగించడంతోపాటు పాత్రికేయులపై తప్పుడు కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు పాత్రికేయులపై నమోదు చేసిన కేసులపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేరే కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దాదాపు 50 మందికిపైగా జిల్లాలో గల పాత్రికేయులు జిల్లాలోని అంబొదల పోలీస్ స్టేషన్ ఐఐసీ సూర్యకాంత్ పాడీని కలిసి వినతిపత్రం అందించారు. గత కొన్ని నెలలుగా మునిగుడ సమితి అంబొదలలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను, పాఠశాల ఆవరణలో బైబిల్ వంటివి విద్యార్థులకు పంపిణీ చేయడం, పాఠశాలలో విద్యార్థులకు వేధించడం, నాసిరకం భోజనాలు ఇవ్వడం వంటి అంశాలను పాత్రికేయులు తమ పత్రికల్లో ప్రచురించడంతో ఆ పాఠశాల హెచ్‌ఎం ఆయా పత్రికల్లో పనిచేసే పాత్రికేయులపై అబద్ధపు కేసులను బనాయించి ఇబ్బందులకు గురిచేయడం వంటి అంశాలను ఖండిస్తున్నట్లు వెల్ఫేర్ కమిటీ సభ్యులు వినతిపత్రంలో పేర్కొన్నారు. పాఠశాలలో జరగుతున్న అన్యాయాలను ఎత్తిచూపే పాత్రికేయులపై ఇలా అబద్ధపు కేసులు బనాయించడం ఏమాత్రం ఆమోదించదగిన విషయం కాదన్నారు. పాఠశాలలో జరుగుతున్న అవినీతి భాగోతాలకు సంబంధించి స్వయాన ఆ పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు జిల్లా యంత్రాంగం దృష్టికి కూడా తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో వారు పత్రికలను ఆశ్రయించారన్నారు. వాటిని ప్రజలకు తెలిసే విధంగా పత్రికల్లో ప్రచురిస్తే అవి అబద్ధాలుగా చిత్రీకరించిన హెచ్‌ఎం కొలా భామనమూర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చాలా విచారకరమన్నారు. ఈ నేపథ్యంలో పాత్రికేయులపై పెట్టిన కేసులు ఎంతవరకు నిజం.. అసలు ఆ పాఠశాలలో జరుగుతున్న అవినీతి భాగోతాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మీడియా వెల్ఫేర్ కమిటీ అందించిన వినతిపత్రంలో వివరించింది. దీనిపై స్పందించిన ఐఐసీ పాడి.. ఈ మేరకు దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.


