జయపురం: మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా జయపురం గగణాపూర్‌లో మూతపడిన సేవా పేపరు మిల్లు కార్మికులు వినూత్నంగా నివాళులర్పించారు. ప్రముఖ కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి నేతృత్వంలో పలువురు సేవా పేపరు మిల్లు కార్మిక నాయకులు బిజూ పట్నాయక్ విగ్రహం ముందు తమ డిమాండ్లతో కూడిన బ్యానర్ పట్టుకొని నివాళులర్పించారు. మీ సమయంలో ప్రారంభించిన సేవా పేపరుమిల్లు గత 20 నెలలుగా మూతపడి ఉంది. బృహత్ పేపరు మిల్లు అని చెప్పి వందలాది కోట్ల రుణాలు తెచ్చి అసమర్థంగా నడిపింది యాజమాన్యం. విశ్రాంత కార్మికుల పెన్షన్, పీఎఫ్ గ్రాట్యుటీ, వేతన బకాయిల కోసం ఎదురు చూసి నేటివరకు 50 మందికి పైగా ప్రాణాలు వీడారన్నారు. వారి కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని, ఇంకా అనేక మంది మృత్యువుతో పోరాడుతున్నారని వెల్లడించారు. పర్మినెంట్, కంట్రాక్ట్ కార్మికుల జీతాలు, పీఎఫ్‌లు పొందలేక పోతున్నారని వెల్లడిస్తూ బిజూ పట్నాయక్ 110 జయంతి సందర్భంగా ఆయన విగ్రహం ముందు తమ గోడు వినిపించారు. సేవా కార్మికులు బాధలు తీర్చేందుకు యాజమాన్యం దృష్టి సారించేలా చూడాలని వేడుకున్నారు.


