చేతబడి నెపంతో వృద్ధుడి దారుణ హత్య
రాయగడ: చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వృద్ధుడిని దారుణంగా గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. జిల్లాలోని అంబొదల పోలీస్‌స్టేషన్ పరిధి శారదాపూర్ పంచాయతీలోని సొండిపొదొరొ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు చిచిరామ్ బాగ్(61)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సైంటిఫిక్ బృందంతొ పాటు డాగ్ స్కాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. సొండిపొదొరో గ్రామంలో నివసిస్తున్న బాగ్ గత కొన్నేళ్లుగా చేతబడి చేస్తున్నట్లు గ్రామస్తులు అనుమానిస్తుండేవారు. గతంలో పలుసార్లు ఇదే విషయమై గ్రామంలో అతనితో గ్రామస్తులు తగాదాలు పెట్టుకునేవారు. ఇదిలాఉండగా సోమవారం రాత్రి నిద్రిస్తున్న బాగ్‌పై గుర్తు తెలియని దుండగులు పదునైన కత్తులతో దాడి చేశారు. గుర్తుపట్టని విధంగా ముఖంపై బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉదయం కుటుంబీకులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం వద్ద పోలీసులు ఒక వేట కత్తి, కర్ర, టార్చ్‌లైట్‌ను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సంబంధించి గ్రామస్తులు నోరు మెదపడం లేదు. చేతబడి నెపంతోనే కొందరు ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు సమాచారం.
చేతబడి నెపంతో వృద్ధుడి దారుణ హత్య
చేతబడి నెపంతో వృద్ధుడి దారుణ హత్య


