ఆడబిడ్డ పెళ్లికి అండగా..!
● రాష్ట్రంలో సీఎం కన్యా వివాహ యోజన ఆరంభం
● పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం
● వదువుకి రూ.51 వేల ఆర్థిక సాయం
భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన మంగళవారం నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గంజాం జిల్లాలోని మా తారా తరణి పీఠంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠం ప్రాంగణంలో సామూహిక వివాహ వేడుక నిర్వహించారు. ఈ మండపాలపై దాదాపు 200 జంటలు అగ్ని సాక్షిగా ఒకటయ్యాయి. ఈ పథకం కింద వరుడి వయస్సు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య, వధువు వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటే వారి పెళ్లికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుంది. ప్రతీ వధువుకు రూ.51,000ల ఆర్థిక సహాయం లభిస్తుంది. అందులో రూ.35,000లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వ్యవస్థ ద్వారా నేరుగా వధువు బ్యాంకు ఖాతాకు బదిలీ చేయబడుతుంది. వివాహ సంబంధిత ఖర్చుల కోసం అదనంగా రూ.6,000లు కేటాయిస్తారు. మిగిలిన రూ.10,000లు బహుమతుల రూపంలో అందజేస్తారు. ఈ బహుమతి ప్యాకేజీలో చీరలు, గాజులు, కాలి మెట్టెలు, పారాణి, సింధూరం, వధువు సారె కింద ఇతర సాంప్రదాయ పెళ్లి అలంకరణలతో పాటు పాత్రలు వంటి గృహోపకరణ వస్తువులు అందజేస్తారు. సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణతో వివాహం ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఈ పథకం ఉద్దేశించబడిందని అధికారులు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా...
ఈ సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాట్లాడుతూ.. వివాహం అనేది ఒక పవిత్రమైన వ్యవస్థ అన్నారు. పెళ్లి వేడుకలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. దీనివలన బాల్య వివాహాల నివారణ, వరకట్నం కట్టడి, వితంతు పునర్వివాహాల ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత తేదీల్లో సామూహిక వివాహ వేడుకలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ పథకం తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన బాలికలు, వితంతువులు మరియు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలు (పీవీటీజీ)కు చెందిన లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.
ఆడబిడ్డ పెళ్లికి అండగా..!
ఆడబిడ్డ పెళ్లికి అండగా..!
ఆడబిడ్డ పెళ్లికి అండగా..!


