పోలీసులపై న్యాయవాది ఫిర్యాదు
జయపురం: జయపురం పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్, ఏఎస్‌ఐలు తనను కొట్టి, అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామని బెదిరించారని న్యాయవాది జి.రాజశేఖర్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గత నెల జనవరి 24వ తేదీన తన సోదరుడితో తనకు స్వల్ప వాగ్వాదం జరగగా తాను గాయాల పాలయ్యానని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాగ్వాదంపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీసుస్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది తనపై తీవ్రంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామని భయపెట్టారన్నారు. కాగా న్యాయవాదిపై పోలీసు దాడిని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సరోజ్ కుమార్ దాస్, కార్యదర్శి సచ్చిదానంద మిశ్రలు తీవ్రంగా ఖండించారు. పట్టణ పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్ కూడా న్యాయవాది ఆరోపణపై స్పందించి పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్రరౌత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
పేకాటరాయుళ్లు అరెస్టు
కొరాపుట్: పేకాటరాయుళ్లను నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఐఐసీ సంబిత్ బెహరా ఈ వివరాలు ప్రకటించారు. వేకువజామున నువాగుడ గ్రామ సమీపంలోని జీడితోటలో భారీ ఎత్తున పేకాట శిబిరం జరుగుతుందనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ పేకాడుతున్న 7గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.40,500ల నగదు సీజ్ చేసినట్లు ఐఐసీ ప్రకటించారు.
నో ఫ్లయింగ్ జోన్‌గా పూరీ
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన పురస్కరించుకుని పూరీని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. మంగళవారం, బుధవారం రెండు రోజులపాటు రాష్ట్రపతి పూరీ పర్యటనలో పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం పూరీ చేరుకొని రాత్రి బస చేశారు. మర్నాడు బుధవారం స్థానిక శ్వేతగంగ తీరంలో పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తారు. అనంతరం శ్రీమందిరం సందర్శించి శ్రీజగన్నాథుడిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా పూరీ జిల్లా యంత్రాంగం భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పూరీ నగరానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించబడ్డాయి. ఈ పరిధిలో పట్టణ ప్రాంతం డ్రోన్ రహిత జోన్ లేదా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించబడింది.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గౌరీ శంకర్
రాయగడ: జిల్లా బీజేడీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాయగడ సమితి మాజీ వైస్ చైర్మన్ పట్నాన గౌరీ శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు శంఖ భవనం నుంచి ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ ఒక ప్రకటనలో మంగళవారం తెలియజేశారు. బీజేడీలో కీలక పాత్ర పోషిస్తున్న గౌరీ గతంలో అమో ఒడిశా – నవీన్ ఒడిశా జిల్లా కన్వీనర్‌గా నియమితులై సేవలు అందించారు. ఆయన నియామకంపై ఆ పార్టీ శ్రేణులు, జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ సరక అభినందించారు. అదేవిధంగా గంజాం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పూర్ణ చంద్ర స్వయి, భగవాన్ గంతాయిత్, మయూర్‌బంజ్ జిల్లాకు రాయిసేన్ ముర్ము, భద్రక్ జిల్లాకు బీజేడీ అధ్యక్షునిగా బ్యామకేష్ రాయ్‌లు నియమితులైనట్లు ప్రకటనలో వెల్లడించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి బీజేడీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించడంతో పాటు పార్టీలో కీలకమైన వ్యక్తులకు పార్టీ పదవులను ఇస్తూ వారిని ప్రోత్సహిస్తోంది.
పోలీసులపై న్యాయవాది ఫిర్యాదు


