సైబర్ నేరాలపై అప్రమత్తత
కొరాపుట్: సైబర్ నేరాలపై అవగాహన కోసం నబరంగ్‌పూర్ జిల్లా ఎస్పీ సందీప్ సంపత్ మడకర్ స్వయంగా ప్రచారం చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో సైకిల్ తొక్కుతూ పర్యటించారు. ప్రతి జంక్షన్ వద్ద సైకిల్‌ను నిలిపి బాటసారులతో మాట్లాడారు. ప్రాడ్ కాల్స్‌కి రిప్‌లై ఇవ్వొద్దని, ఫోన్‌కు వచ్చే ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, అకౌంట్లలో డబ్బులు మాయమైతే వెంటనే సైబర్ సెల్‌కి ఫోన్ చేయాలని సూచించారు. అవగాహన కల్పించేందుకు కర పత్రాలు అందజేశారు. పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాయఘడలో..
పర్లాకిమిడి: సైబర్ నేరాలు, ప్రజల భద్రతపై జిల్లాలోని రాయఘడ పోలీస్ స్టేషన్ నుంచి మార్కెట్, బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీని రాయఘడ ఐఐసీ, పి.ఎం.శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించారు. సైబర్ నేరాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ డివిజనల్ పోలీసు అధికారి అమితాబ్ పండా సూచించారు. ఆర్.ఉదయగిరి బ్లాక్‌లోని చెలిగడ వారపు సంత వద్ద సైబర్ నేరాలపై షార్ట్ ఫిల్ములు, మొబైల్ స్క్రీన్‌పై ప్రసారం చేసి ప్రజలను చైతన్య పరిచారు. సైబర్ మోసాలకు గురైనవారు టోల్‌ఫ్రీ నంబర్ 1930కు తక్షణమే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ సురక్షిత ప్రచారం ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ జ్యోతింద్ర పండా తెలియజేశారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత


