బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దంత గ్రామానికి చెందిన చాకిపల్లి సుందరమ్మ(62) అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుందరమ్మ కుమార్తె రాడ నీలవేణి శనివారం దంత గ్రామంలో జరిగిన శుభకార్యానికి వచ్చారు. ఆమెను తిరిగి వారి గ్రామానికి పంపించేందుకు కొత్తమ్మ తల్లి గుడి వద్దకు సుందరమ్మ కూడా వెళ్లింది. ఈ క్రమంలో టెక్కలి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గ్రామం వద్దకు వచ్చి రిటర్న్ చేస్తున్న క్రమంలో సుందరమ్మను ఢీకొట్టింది. బస్సుకు, వెనుక ఉన్న బండరాయికి మధ్య ఇరుక్కుపోవడంతో నడుముకి తీవ్ర గాయం కావడంతో హుటాహుటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిచారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కోటబొమ్మాళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నీలమణిదుర్గ సన్నిధిలో విదేశీయులు
పాతపట్నం: ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారిని లండన్‌కు చెందిన మహిళలు రీటా, ఫ్లేలు శుక్రవారం దర్శించుకున్నారు. కుంకుమ పూజలు నిర్వహించారు. స్నేహితుల పెళ్లి కోసం భారత్ వచ్చామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు టి.రాజేష్ పాల్గొన్నారు.
రేపటి నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం
శ్రీకాకుళం/శ్రీకాకుళం కల్చరల్: సాహిత్య సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలలో భాగంగా శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవాలు నిర్వహించనున్నామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్‌లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం సందర్భంగా ఆదివారం బైక్ ర్యాలీ, పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నెల 15 నుంచి 17 తేదీలలో ఉత్తరాంధ్ర స్ధాయి మ్యాజిక్ వర్క్ షాప్‌ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించనున్నామన్నారు. ఔత్సహితులైన సైన్సు ఉద్యమ అభిమానులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 23న జిల్లా స్థాయి చెకుముకి సైన్సు సంబరాలు శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, 83 మంది మండల స్ధాయి విజేతల బృందంతో నిర్వహించనున్నామని వివరించారు. కార్యక్రమంలో చెకుముకి జిల్లా కన్వీనర్ పి.కూర్మారావు, గౌరవ అధ్యక్షుడు బి.మోహనరావు, ఎం.ప్రదీప్, ఎం.వాగ్ధేవి, హెచ్ మన్మధరావు, బి.వెంకటరావు, సీహెచ్ ఉమామహేశ్వర్, ఎస్ సంజీవరావు, పి.జగదీశ్వరరావు, టి.ఎర్రమ్మ, కృష్ణారావు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి


