మాదకద్రవ్యాలకు స్వస్తి పలకండి
భువనేశ్వర్: మాదక ద్రవ్యాలకు స్వస్తి పలకడం దేశ భక్తితో సమానమని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. స్థానిక రాజ్ భవన్ న్యూ అభిషేక్ హాల్‌లో నిర్వహించిన మత్తు రహిత భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మాదకద్రవ్యాలను తిరస్కరించడం వ్యక్తిగత శ్రేయస్సుకు పరిమితం కాదని, దేశం పట్ల లోతైన విధిని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం, ఉత్పాదకత, పౌరుల క్రమశిక్షణ శక్తివంతమైన దేశం ప్రామాణికలుగా పేర్కొన్నారు. మత్తు వ్యసనం త్యజించిన బాధ్యతాయుతమైన సమాజంలో సభ్యులుగా దేశ పురోగతికి దోహదపడ్డారని ప్రోత్సహించారు.
వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు, వివిధ విద్యా సంస్థల విద్యార్థులు ఈ సమావేశంలో ప్రత్యక్షంగా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పలు ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. మాదకద్రవ్యాలు వంటి వ్యసనం యువతరం జీవితాలను నాశనం చేస్తాయని గవర్నర్ తెలిపారు. వర్సిటీలు వంటి పవిత్ర ప్రాంగణాల్లో మత్తు పదార్థాల ఉనికి యావత్ విద్యాభ్యాసం వాతావరణాన్ని విషపూరితం చేస్తుందన్నారు. భారత దేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా నిలవాలని ఆకాంక్షిస్తుంది. ఆ లక్ష్యాన్ని సాధించడంలో యువత పాత్ర కీలకమని డాక్టర్ కంభంపాటి అన్నారు. మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతపరిచేందుకు వీధి నాటకాలు, పోస్టర్ తయారీ పోటీలు, వాక్‌థాన్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా యువత వ్యసనాన్ని నివారించడంపై దృష్టి సారించిన విద్యా సంస్థల కోసం లఘు చిత్ర నిర్మాణం పోటీని గవర్నర్ ప్రతిపాదించారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టరు జనరల్ వైబీ ఖురానియా, కటక్ ఎస్‌సీబీ వైద్య బోధన ఆస్పత్రి మానసిక తత్వ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శారద ప్రసాద్ స్వంయి, వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, నైపుణ్యత అభివృద్ధి, సాంకేతిక విద్యా విభాగం కమిషనర్, కార్యదర్శి, గవర్నర్ కమిషనర్, కార్యదర్శి రూపా రోషన్ సాహు తదితర ప్రముఖులు ఈ సమావేశంలో ప్రసంగించారు.
గవర్నర్ పిలుపు
మాదకద్రవ్యాలకు స్వస్తి పలకండి


