వామపక్ష పార్టీలు బలపడితేనే సుస్థిరత
జయపురం: ప్రపంచంలో పలు దేశాలలో కమ్యూనిస్టు పార్టీ, వామపక్షాలు బలపడి ఉండగా, కొన్ని దేశాలలో సామ్రాజ్యవాద శక్తులు తలెత్తుతున్నాయ ని వాటి వల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజలకు పెను ముప్పు ఏర్పడుతుందని ఒడిశా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులు ప్రమోద్ కుమార్ మహతి అన్నా రు. జయపురం సమితి బొయిపరిగుడలో కమ్యూ నిస్టు పార్టీ జోనల్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జోనల్ కమ్యూనిస్టు నేత లయిచన్ ముదులి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సెప్టెంబర్ 21 నుంచి 25 వ తేదీ వరకు చండీగఢ్‌లో జరిగిన అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ మహాసభలో చర్చ అంశాలను కార్యకర్తలకు వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే ప్రపంచానికి నేతగా వ్యవహరిస్తున్నారని, అయితే చైనా, రష్యా, భారత్‌ల కలవటం అతడికి ఆందోళన కలిగిస్తోందన్నారు. పాలస్తీనాకు అండగా వామపక్షాలు ఉండటంతో సామ్రాజ్య వాదులకు కన్నెర్రగా ఉందన్నారు. ప్రపంచంలో వామపక్షాలు బలపడిన నాడే సుస్థిరత వస్తుందని తెలిపారు. 2014 లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ పాలన వచ్చిన తర్వాత దేశంలో మత విబేధాలు పెరిగాయని, ధర్మ నిరపేక్ష, నీతి మంటగలిసిందని, రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాల పై నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించేందుకు చర్యలు చేపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష పాలనలోగల కేరళ రాష్ట్రం దేశంలో ప్రథమ పేదరిక విముక్త రాష్ట్రంగా నిలిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని వివరించారు. దేశంలో వామపక్ష పాలన వచ్చి నాడు దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి జుధిష్టర్ రౌళో, కార్యదర్శి రామకృష్ణ దాస్ ప్రసంగిస్తూ బొయిపరిగుడ జోన్‌లో అధిక సభ్యులను చేర్చేందుకు కార్యకర్తలు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి బుధ్ర బొడొనాయిక్, బొయిపరిగుడ జోనల్ కార్యదర్శి బలభధ్ర భోయి,యువ నేత మధు జాని,జోనల్ సహాయ కార్యదర్శి రామ పంగి తదితరులు పాల్గొన్నారు.


