
వివాదం పూర్వాపరాలివే..
2014 నుంచి 2016 వరకు సుమారు మూడేళ్ల పాటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒడిశాను సంప్రదించకుండానే బహుళ బ్యారేజీలు, ఆనకట్టలను నిర్మిస్తోందనే ఆరోపణల వెల్లువెత్తాయి. ఈ నిర్మాణాలు వర్షాకాలం తర్వాత దిగువ ఒడిశా ప్రాంతానికి నీటి ప్రవాహం అడుగంటిపోతుందని ఒడిశా వ్యక్తీకరించిన ఆవేదనని ఎగువ ఛత్తీస్‌గడ్ పెడ చెవి ధోరణితో నిర్లక్ష్యం వహించింది. 2016 జూలైలో ఒడిశా పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కోరింది. ఈ ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ తీవ్రంగా ఖండించింది. చట్టపరమైన హక్కుల పరిధిలో అన్ని నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొంది. పరిస్థితి చేయిదాటుతన్నట్లు గమనించిన ఒడిశా 2016 నవంబర్‌లో అంతర్–రాష్ట్ర నదీ జల వివాద చట్టం, 1956 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఒడిశా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఒడిశా ప్రభుత్వం అభ్యర్థనల్ని పరిశీలించిన మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలతో 2018 మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ అధ్యక్షతన మహానది జలాల పంపిణీ వివాద ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. అది మొదలుకొని ఉభయ పక్షాల వాదోపవాదాలతో అనుబంధ పరిస్థితులు, పరిణామాలపై ట్రిబ్యునల్ విచారణ నిరవధికంగా కొనసాగిస్తోంది. అంతకు ముందు ఉభయ రాష్ట్రాల మధ్య ఈ వివాదం సామరస్య పరిష్కారానికి నిర్వహించిన చర్చలు, సమావేశాలు పూర్తిగా బెడిసికొట్టాయి. రాష్ట్రంలో కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో ట్రిబ్యునల్ విచారణ దారి తప్పించి సామరస్య మంతనాలకు మెలికతిప్పారు. ఈ మేరకు ట్రిబ్యునల్ అనుమతి కోసం అభ్యర్థించారు. ఈ క్రమంలో సాధించిన పురోగతిని ట్రిబ్యునల్‌కు ఉభయ పక్షాల న్యాయవాదులు వివరిస్తూ లిఖితపూర్వక ఆధారాల్ని ప్రవేశ పెట్టడంతో ట్రిబ్యునల్ విచారణని వాయిదా వేసినట్లు ప్రకటించింది. రాజకీయ ప్రయత్నాలతో చట్టపరమైన పోరాటాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా మోహన్ చరణ్ మాఝి సర్కారు పారదర్శకంగా వ్యవహరించాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తాజా సమావేశం ఎప్పుడో...
సామరస్య చర్చలతో మహా నది జలాల పంపిణీ వివాద పరిష్కారం కోసం విచారణ వాయిదా వేయించిన ఉభయ పక్షాల న్యాయవాదులు తాజా సామరస్య సమావేశం వివరాల్ని ప్రకటించకుండా దాటవేశారు. విపక్షం వైఖరితో విశ్వసనీయత కూడగట్టుకుని న్యాయస్థానేతర కార్యాచరణకు ముందుకు సాగాలని ఇటీవల విపక్ష నేత నవీన్ పట్నాయక్ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు.

వివాదం పూర్వాపరాలివే..