
బీడీవో మమ్మల్ని పట్టించుకోవడం లేదు
జయపురం: బొయిపరిగుడ బీడీవో శక్తి మహాపాత్రోపై ఆ సమితి ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమను బీడీవో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆరోపించారు. అంతేకాకుండా తనకు నచ్చిన పథకాల జాబితాలు తయారు చేసి వాటిని ఆమోదించేందుకు కలెక్టర్ వద్దకు పంపారని ఆరోపించారు. బొయిపరిగుడ సమితి ఉపాధ్యక్షులు పూర్ణిమ బారిక్, సమితి సభ్యులు త్రిలోచన జెన, బిభీషణ హంతాల్, కమలా హరిజన్, లక్ష్మణ చంద్రపొడియ, చంద్ర హరిజన్‌లతో పాటు పలువురు సభ్యులు కలెక్టర్‌ను శుక్రవారం కలిసి బీడీవో తీరుపై ఫిర్యాదు చేశారు. బీడీవో మహాపాత్రో సమితి సభ్యుల సమావేశం జరుపకుండా తనకు ఇష్టం వచ్చినట్టు కొన్ని పంచాయతీలలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాలలో అభివృద్ధి పనులు చేసేందుకు జాబితాను తయారు చేసి గత నెల 14వ తేదీన కలెక్టర్ ఆమోదం కోసం పంపినట్లు ఆరోపించారు. ఆ ప్రాజెక్టులపై తమకు ఎటువంటి సూచనలు చేయలేదని పెందపొడ, మఠపొడ, చెరక, దొరాగుడ, సహిద్ లక్ష్మణ నాయిక్ జన్మస్థలం తెంతులిగుమ్మ, పంచాయతీలలో ఏ ఒక్క ప్రాజెక్టు కల్పించలేదన్నారు. మరో జాబితా తయారు చేసి ఇవ్వాలని బీడీవోను కలిసి కోరినప్పటికీ పట్టించుకోలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బీడీవో పంపిన ప్రాజెక్టుల జాబితాను ఆమోదించ వద్దని, సమితి సభ్యుల సమావేశం ఏర్పాటు చేయాలని, సమితి సభ్యుల ఆమోదం పొందిన ప్రాజెక్టుల జాబితాను పంపించమని బీడీవోను ఆదేశించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్‌కు బొయిపరిగుడ సమితి నాయకుల ఫిర్యాదు