
దారిమళ్లిన లారీ యజమానుల సంఘ నిధులు
రాయగడ: లారీ యజమానుల సంఘానికి చెందిన 60 కోట్ల రూపాయలకు పైగా నిధులు దారిమళ్లించి ఆ నిధులతో స్వంత వ్యాపార లావాదేవీలు కొనసాగించి కోట్ల రుపాయలకు పడగెత్తిన రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ జిల్లా అధ్యక్షుడు నెక్కంటి భాస్కరరావు ఆగడాలకు ఇక చెక్ పెట్టడం ఖాయమని లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు యాల్ల కొండబాబు (వేంకటేశ్వరులు) అన్నారు. ఈ మేరకు లారీ యజమానుల సంఘం కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన నెక్కంటి కార్యకలాపాలపై దుమ్మెత్తి పోశారు. నాలుగు దశాబ్దాలకు పైగా లారీ యజమానుల సంఘానికి ప్రాతినిథ్యం వహించిన నెక్కంటి ఈమేరకు సంఘానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయాన్ని కాజేశారని ఆరోపించారు. గత రెండేళ్లుగా తాను లారీ యజమానుల సంఘానికి అధ్యక్షుడిగా ఉండి సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూర్చామని వివరించారు. ఈ నిధుల్లో భాగంగా సుమారు రు. 60 లక్షలు వెచ్చించి కార్యాలయం భవనం నిర్మించామని అన్నారు 40 ఏళ్లు సంఘానికి ప్రాతినిథ్యం వహించిన నెక్కంటి సంఘానికి వచ్చే నిధులను దారిమళ్లించి తమ సొంత వ్యాపారాలకు పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. బినామీ పేర్లతో వ్యాపారాలను కొనసాగించి కోట్లాది రూపాయలకు పడగలెత్తిన నెక్కంటి కాజేసిన సంఘం నిధులు లారీ యజమానుల కష్టార్జితమేనని అన్నారు. సంఘం నిధులు,వాటి లెక్కలను చూపించని నెక్కంటిపై సదరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు చేయకుండా పోలీస్ యంత్రాంగం నాన్చుతుందని ఆరోపించారు . కేసు నమోదు చేయాలంటే అందుకు నెక్కంటికి సంబంధించిన కొన్ని వివరాలు సమర్పిస్తేనే తాము కేసు రిజిష్ట్రర్ చేస్తామని పోలీసులు తనకు నోటీసులు జారీ చేశారని కొండబాబు చెప్పారు.
ఆందోళన చేస్తాం..
లారీ యజమానుల సంఘం నిధులు దారిమళ్లింపునకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో నెక్కంటిపై ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించి దానికి అనుగుణంగా దర్యాప్తు చేయకపొతే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడం ఖాయమని కొండబాబు వెల్లడించారు. అనంతరం నెక్కంటికి సంబధించిన వ్యాపార అక్రమ లావాదేవీలకు సంబంధించి విలేకర్ల సమావేశంలొ ప్రస్తావించారు. ఈ సమావేశంలొ లారీ యజమానుల సంఘానికి చెందిన కార్యకర్తలు ఆదినారాయణ, సంఘం కార్యదర్శి కడుపుకూట్ల జానకీరామయ్య తదితరులు పాల్గొన్నారు.