
ఒడియా సినిమాకు జాతీయ అవార్డు
భువనేశ్వర్: జాతీయ చలనచిత్ర అవార్డులు–2023లో పుష్కర ఉత్తమ ఒడియా చిత్రంగా గెలుపొందింది. నాన్–ఫీచర్ ప్రత్యేక ప్రస్తావన (స్పెషల్ మెన్షన్) లఘుచిత్రంగా ది సీ – ది సెవెన్ విలేజెస్ ప్రత్యేక గుర్తింపు పొందింది. శుభ్రాంషు దాస్ దర్శకత్వం వహించిన ‘పుష్కర’ ఒడియా చలన చిత్రంలో సబ్యసాచి మిశ్రా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ చిత్రం శంకర్ త్రిపాఠి రచన ఒడియా నవల ‘నాదబిందు’ ఆధారంగా నిర్మించారు. అనేక చలనచిత్రోత్సవాలలో పుష్కర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాతీయ వేదికపై అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. పుష్కర’ గ్రామీణ ఒడిశాలోని సంప్రదాయం, సామాజిక పరివర్తన ఇతివృత్తాలతో చిత్రీకరించారు. హిమాంషు ఖటువా దర్శకత్వం వహించిన ది సీ – ది సెవెన్ విలేజెస్ లఘు చిత్రం ఒడిశాలోని సాతొభయ్యా తీరప్రాంత స్థానభ్రంశంతో సమాజాల భావోద్వేగ, సామాజిక, పర్యావరణ పరిణామాల్ని సమగ్రంగా చిత్రీకరించింది. ఈ చిత్రం వాతావరణ మార్పు, సముద్ర మట్టాలు పెరగడం, ఈ ప్రాంతంలోని తరతరాలుగా కుటుంబాలను ప్రభావితం చేస్తున్న పూర్వీకుల గృహాల నష్టం వాస్తవాల్ని తెరకి ఎక్కించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘పుష్కర’ ఉత్తమ ఒడియా చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ‘ది సీ అండ్ సెవెన్ విలేజెస్’ నాన్–ఫీచర్ విభాగంలో ఉత్తమ ఒడియా చిత్రంగా అవార్డును పొందింది. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక ఇతర వర్గాల్ని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అభినందించారు. ఒడియా చలన చిత్ర రంగం మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

ఒడియా సినిమాకు జాతీయ అవార్డు