
అంకితభావంతో సేవ చేయండి: గవర్నర్
భువనేశ్వర్: యువ అధికారులుగా ప్రభుత్వ నియమాలు, ఫైళ్లకు పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం వాస్తవ కార్యాచరణగా ఉన్నత సామాజిక జీవన ఆవిష్కర్తలుగా వెలుగొందాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి తెలిపారు. శుక్రవారం రాజ్ భవన్ ప్రాంగణం న్యూ అభిషేక్ హాల్‌లో 2022 బ్యాచ్‌కు చెందిన 83 మంది శిక్షణార్థి ఒడిశా రెవెన్యూ సర్వీస్ (ఓఆర్‌ఎస్) అధికారులతో గవర్నర్ ప్రత్యక్షంగా సంభాషించారు. కార్యక్రమంలో గవర్నర్ కమిషనర్ రూపా రోషన్ సాహు పాల్గొన్నారు. ప్రభుత్వ పాలన వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రధారులు రెవెన్యూ సర్వీస్ అధికారులుగా పేర్కొన్నారు. వీరి సేవలు ప్రజల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. నిజాయితీ, అంకిత భావంతో ప్రజలకు సేవ చేయడంలో అధికారులు తమ బాధ్యతలను ప్రతిబింబించాలని కోరారు. భూముల సంబంధిత రికార్డుల నిర్వహణ, వివాద పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు రెవెన్యూ అధికారుల కీలక బాధ్యతలుగా గవర్నర్ వివరించారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన పౌరులను నమోదు చేయడంలో ఓఆర్‌ఎస్ అధికారుల చురుకై న పాత్ర ప్రజల విశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.