
స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి
జయపురం: జయపురం సబ్ డివిజన్ స్థాయిలో స్వాతంత్య్ర వేడుకులు ఘనంగా జరపాలని సబ్ డివిజన్ వేడుకల కమిటీ నిర్ణయించింది. స్థానిక మునిసిపాలిటీ కౌన్సిల్ సభాగృహంలో జయపురం సబ్ కలెక్టర్, మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి అధ్యక్షతన స్వాతంత్య్ర ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. స్వాతంత్య్ర దినాన ఉదయం పట్టణంలో మైక్ ద్వారా రామ్‌ధన్ ప్రచారం చేయాలని, అనంతరం పట్టణంలో గల సాతంత్య్ర యోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించాలని సమావేశం నిర్ణయించింది. పట్టణంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో, సంస్థలలో ఉదయం 7.30 నుంచి 8.30 గంటలలోపు జాతీయ పతాకాలు ఎగురవేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఉదయం పేరేడ్ మైదానంలో 9.15 గంటలకు ముఖ్యఅతిథిగా సబ్‌కలెక్టర్ పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేస్తారు.
అనంతం ఉత్కళ బాలాశ్రమలో పిల్లలకు, జిల్లా కేంద్ర హాస్పిటల్‌లో రోగులకు, జయపురం సబ్ జైలులో ఖైదీలకు పండ్లు, మిఠాయిలు పంచుతారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా విద్యార్థులలో ఒడియా, ఆంగ్ల భాషలలో వక్తృత్వ, వ్యాసరచనలు, పోటీలతోపాటు దేశ భక్తి గీతాలు, చిత్ర లేఖనం పోటీలు నిర్వహిస్తారు. చిత్రలేఖన తప్ప.. మిగతా పోటీలన్నీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తారు. చిత్ర లేఖన పోటీలు స్థానిక విక్రమ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కళాశాలలో నిర్వహించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్థ జగదీష్ కాశ్యప్, బీడీఓ శక్తి మహాపాత్రో, పోలీసు అధికారులు, పలు ప్రభుత్వ విభాగాల అధికారులు, వివిధ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి