
జాతీయ విద్యా విధానం ఉత్సవంలో ఉమామహేశ్వరి
ఇచ్ఛాపురం రూరల్: న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)–2025 ఉత్స వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరవిల్లి ఉమామహేశ్వరి పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈమె గురువారం విద్యార్థులు జి.లావణ్య, టి.శ్రావ్యలతో కలసి న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు. గతంలో రేగిడిలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సమయంలో ఈమె మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘నేచురల్ హెయిర్ డై’ సైన్స్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేరు పొందింది. ప్రాజెక్ట్‌ను స్వయంగా తిలకించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ ఆమెను అభినందించారు. ఇండియాలో 27 ఉత్తమ ప్రాజెక్ట్‌లలో ఉమామహేశ్వరి రూపొందించిన ‘నేచురల్ హెయిర్ డై’ ప్రాజెక్ట్ ఒకటి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ యోగేష్ బ్రహ్మాంకర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎలంగోవన్‌లు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఉప విద్యాశాఖాధికారి విలియమ్స్, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎన్.కుమారస్వామి, మండల విద్యాశాఖాధికారులు కురమాన అప్పారావు. ఎస్.విశ్వనాథం అభినందించారు.