
ఉమ్మడి సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని జోన్లలోనూ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ల ద్వారా ఎంఈఓ–1 పోస్టులు భర్తీ చేయడానికి దాదాపు కసరత్తు చేశారని, ఎంఈఓ–2 పోస్టుల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్స్ ఉంటుండగా.. ఎంఈఓ–1 పోస్టులను ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ ద్వారా భర్తీ చేయడాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం దాసరి క్రాంతి భవన్‌లో గురువారం ఎస్టీయూ నాయకులు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా పరిషత్ యాజమాన్య టీచర్లకు పదోన్నతులలో తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు సంబంధించి 72,73, 74 జీవోలు అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులే సమన్యాయాన్ని పాటించకుండా పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకొని ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రీఅపోర్షన్ పోస్టుల్లో పని చేస్తున్న టీచర్ల జీతాలు చెల్లింపు, బోధనేతర కార్యక్రమాలను రద్దుచేయాలని, పెండింగ్ బకాయిలు విడుదల, పెండింగ్ డీఏల చెల్లింపులు, ఐఆర్ విడుదల, పీఆర్సీ చైర్మన్ నియామకం తదితర సమస్యల పరిష్కారానికి ఈ నెల 2న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రతినిధులు చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, కె.గడ్డెన్నాయు డు,వివిధ మండలశాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.