
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు రెడ్డిపేట సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గ్రామస్తులు గుర్తించారు. ఆమదాలవలస పోలీసులకు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి పరిశీలించారు. మృతుడు సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని, నాలుగు రోజులుగా పరిసర గ్రామాల్లో భిక్షాటనం చేస్తూ తిరిగేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
జిల్లా క్రీడాభారతి నూతన కార్యవర్గం ఏర్పాటు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా క్రీడాభారతి నూతన కార్యవర్గం గురువారం ఏర్పాటైంది. అరసవిల్లి సమీపంలోని చైతన్య విద్యా విహార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాభారతి జిల్లా అధ్యక్షుడిగా చెటికం రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా బలగ అనంత లక్ష్మదేవ్ (అను), కోశాధికారిగా దండాసి జ్యోతిభాస్కర్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ కర్త, ఒలింపియన్ ఎం.వి.మాణిక్యాలు మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి ఉన్న ఒక క్రీడను మాత్రమే ఎంచుకని, అందులోనే ఉన్నతంగా సాధన చేసి రాణించాలన్నారు. సెల్‌ఫోన్లకు, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతను కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ అధికారి వంగా మహేష్, క్రీడాభారతి సభ్యులు బి.ఖగేశ్వరరావు, మణికంఠ, క్రీడాకారులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం