
వీఐపీ దర్శనం ముసుగులో మోసం
భువనేశ్వర్: పూరీలో కొలువుదీరిన జగన్నాథుడు ప్రపంచవ్యాప్తంగా అశేష భక్తజనుల ఆరాధ్య దైవం. స్వామి దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. శ్రీమందిరంలో అత్యంత చేరువలో మూల విరాటులను కళ్లారా దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈ భక్తిభావాన్ని సొమ్ము చేసుకునే దిశలో చాటుమాటున ఆన్‌లైన్‌లో వీఐపీ దర్శనం పేరుతో నిలువు దోపిడీ ప్రారంభం అయింది. హరి ఓం యాప్‌లో వీఐపీ దర్శనం చేసుకోవచ్చని తప్పుడు ప్రచారం ఊపందుకుంది. రూ.1,000లకు వీఐపీ దర్శనం చేసుకోవచ్చని ఈ యాప్ ప్రచారం చేస్తున్న విషయం బట్టబయలైంది. స్లాట్ బుకింగ్ కోసం హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేసింది. ఒక భక్తుడు స్లాట్ బుక్ చేసుకుని మోసపోయిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
సైబర్ ఠాణాలో ఫిర్యాదు
శ్రీమందిరంలో మూల విరాటుల వీఐపీ దర్శనం పేరుతో భక్తులను హరి ఓం యాప్ మోసం చేసిందని ఆరోపిస్తూ శ్రీమందిరం అధికార వర్గం (ఎస్‌జేటీఏ) సైబర్ ఠాణాలో ఫిర్యాదు దాఖలు చేసింది. శ్రీమందిరం ఆధ్వర్యంలో వీఐపీ దర్శనం కోసం ఎటువంటి వ్యవస్థ పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనం పేరిట భక్తులను మోసగిస్తున్న హరి ఓం యాప్‌పై చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.