
రావిశాస్త్రి ప్రసంగానికి శరత్‌బాబు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమానికి నగరానికి చెందిన రచయిత జంధ్యాల శరత్‌బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న రావిశాస్త్రి జయంతి పురస్కరించుకొని ‘సామాన్యుడి అండదండ రావిశాస్త్రి’ అంశంపై ప్రసంగం చేయనున్నారు.
యువతి ఆత్మహత్య
తడ: అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం, గొల్లవూరు గ్రామానికి చెందిన జీరు పూజిత(21) అనే యువతి ఆదివారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్‌ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసే పూజిత తడకండ్రిగలోని ఓ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అద్దెకు నివసిస్తోంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను అదే పరిశ్రమలో పని చేసే ఆనంద్ కృష్ణన్ అనే మిత్రుడు తరచూ పరామర్శిస్తుండేవాడు. ఈ క్రమంలో చనిపోయిన రోజు కూడా ఆనంద్ కృష్ణన్ ఆమెను ఉదయం పలకరించి వెళ్లాడు. సాయంత్రం వచ్చిన అతను పూజిత గదిలో సీలింగ్ ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని ఉన్నట్టు గమనించి, అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న మరో వ్యక్తి సాయంతో తలుపులు పగుల కొట్టి ఆమెను కిందకు దించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మృతురాలి తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వడంతో సోమవారం తడకు వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొడపనాయుడు తెలిపారు.
చికిత్స పొందుతూ
వివాహిత మృతి
శ్రీకాకుళం రూరల్: మండలంలోని పెదపాడు పంచాయతీ పరిధి ధర్మాన లే అవుట్‌లో భార్యాభర్తల మధ్య తలెత్తిన తీవ్ర మనస్పర్థలు ఓ వివాహిత ప్రాణాలను బలిగొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మాన లే అవుట్‌లో నివసిస్తున్న యవ్వారి రాజేష్ కుటుంబంలో ఒక శుభ కార్యానికి సంబంధించి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో తన అభిప్రాయానికి విలువ లేకుండా భర్త మాటే నెగ్గుతుందని భావించిన భార్య అనూష(30) తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఈనెల 23వ తేదీన దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే శ్రీకాకుళం నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అనూష సోమవారం ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి పాలవలస మోహనరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ కె.రాము తెలిపారు.
వృద్ధుడు అదృశ్యం
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం గ్రామానికి చెందిన కంఠస్ఫూర్తి కనకరాజు ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని జే.ఆర్.పురం పోలీసులు సోమవారం తెలిపారు. వయస్సు 78 సంవత్సరాలు, మతి స్థిమితం సరిగ్గా లేదని చెప్పారు. ఈ మేరకు కుమారుడు సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎస్.చిరంజీవి వెల్లడించారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి దూసి – పొందూరు రైల్వేస్టేషన్ల మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని జీఆర్‌పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి సుమారు 65 ఏళ్ల వయస్సు ఉంటుందని, నీలం, ఎరుపు రంగు గీతల షర్టు, నీలం గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు.
ముద్దాయికి
రెండున్నర ఏళ్ల జైలు శిక్ష
కొత్తూరు: మండల కేంద్రం కొత్తూరు పంచాయతీ పరిధి కొత్త కొత్తూరులోని ఉమామల్లిఖార్జున స్వామి ఆలయం తాళాలను, హిరమండలంలోని సుబలాయి గ్రామానికి చెందిన రాగోలు బాలకృష్ణ 2019లో పగలుగొట్టి రూ.20 వేల నగదును చోరీ చేశాడు. ఈ ఘటనలో ముద్దాయి బాలకృష్ణపై నేరం రుజువు కావడంతో ఆయనకు కొత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి సోమవారం రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు స్థానిక సీఐ చింతాడ ప్రసాదరావు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై 2019వ సంవత్సరంలో కొత్తూరు ఎస్‌ఐగా పని చేసిన బాలకృష్ణ కేసు నమోదు చేశారు. కేసును ఎస్‌ఐలు బాలకృష్ణ, కె.గోవిందరావులు దర్యాప్తు చేశారన్నారు. ఏపీపీగా ఎల్.నాగభూషణరావు వ్యవహరించారు.

రావిశాస్త్రి ప్రసంగానికి శరత్‌బాబు ఎంపిక