
పింఛన్ కోసం మాజీ ఎమ్మెల్యే సతీమణి వినతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సదన్ నాయిరక్ భార్య తిలోత్తమ నాయిక్ తనకు పింఛన్ మంజూరు చేయమని వేడుకుంటున్నారు. ఈ మేరకు కొరాపుట్ పెన్షనర్స్ అదాలత్‌ను ఆశ్రయించారు. మాజీ ఎమ్మెల్యే గత జనవరి నెలలో చనిపోయారు. బిజూ పట్నాయిక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990లో కొట్‌పాడ్ నియోజక వర్గం నుంచి నాయిక్ జనతాదల్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికై 1995 వరకు ఎమ్మెల్యే కొనసాగారు. అతనికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారిరువురు వివాహితులు. కొట్‌పాడ్ సమితిలో చిత్రగుడ లో తిలోత్తమ నాయిక్ ఉంటున్నారు. భర్త పోయిన తరువాత ఆమె ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. భర్త చనిపోయిన తరువాత పింఛన్ వస్తుందని ఆశించారు. కానీ భర్త సదన్ నాయిక్ పెన్షన్ బుక్‌లో ఆమె పేరులేక పోవటంతో సమస్య అయింది. మాజీ ఎమ్మెల్యే అయిన సదన నాయిక్ భార్యనైన తనకు పింఛన్ మంజూరు చేయాలని ఆమె ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర పెన్షన్ విభాగం వారు గురువారం కొరాపుట్‌లో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నారని తెలిసి తిలోత్తమ నాయిక్ అక్కడకు వెళ్లి లిఖిత పూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె తన వద్దగల ఆధారాలు సమర్పించగా..అధికారులు సంతకాలు తీసుకొని రాష్ట్ర పెన్షన్ అధాలత్ విభాగానికి పంపుతామని తెలిపినట్లు ఆమె వెల్లడించారు.