
సముద్రంలో వ్యక్తి గల్లంతు
రణస్థలం : మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సరదాకు స్నానానికి వెళ్లి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్ (31), ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ కలిసి కందివలస గెడ్డలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీరు బాగోలేదని సమీపంలోని దోనిపేటలో సముద్ర స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి తొలుత నీలాపు రమణ మునిగిపోతుండగా గమనించిన సూర్యనారాయణ, సంతోష్‌లు కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యనారాయణ, రమణ ఒడ్డుకు చేరుకున్నా సంతోష్ మాత్రం మునిగిపోయాడు. చాలాసేపు వెతికినా సంతోష్ జాడ కానరాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. జె.ఆర్.పురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాలించినా సంతోష్ ఆచూకీ దొరకలేదు. సంతోష్‌కు భార్య భవాని, ఇద్దరు కుమారులు సిద్దార్ధ, హర్షవర్దన్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ గల్లంతయ్యాడని తెలిసి తల్లిదండ్రులు రాము, సరస్వతి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి గతంలో పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్‌లో కెమిస్ట్‌గా పని చేసి హైదరాబాద్ వెళ్లాడు. మళ్లీ స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగం సాద్ధిద్దామనే ఉద్దేశంతో నెల రోజుల కిందట గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పునరావాస కాలనీ పనులకు కమిటీలు
టెక్కలి: సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసితుల కోసం నౌపడ సమీపంలో తలపెట్టిన పునరావాస కాలనీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో మంగళవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలనీ పనులు వేగవంతానికి అధికారులతో కమిటీలు వేయనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రాజా , డ్వామా పీడీ సుధాకర్‌రావు, గృహ నిర్మాణ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖాధికారులు పాల్గొన్నారు.
తెలుగు మీడియం రద్దు దుర్మార్గం
శ్రీకాకుళం: రాష్ట్రంలో తెలుగు మీడియం విద్యా బోధన రద్దు చేయటం దుర్మార్గమని రాష్ట్ర ఎడ్యుకేషన్ సబ్ కమిటీ, జన విజ్ఞానవేదిక కన్వీనర్, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని సంస్కరణల పేరిట నాశనం చేస్తోందని, ఇటువంటి చర్యలను ఉపాధ్యాయ సంఘాలు ఉపేక్షించవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగు మీడియం లేకపోతే ప్రభుత్వ విద్యా రంగం నాశనం అవుతుందన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యను బలోపేతం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని మండిపడ్డారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు టీచర్లను కేటాయించాలని, ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని కోరారు. కూటమి ప్రభుత్వం 9రకాల పాఠశాలలను ఏర్పాటు చేయటం నష్టదాయకమన్నారు. పాఠశాలలను కుదించటం, సెక్షన్లు తగ్గించటం, ఒకే మీడియం అమలు చేయటం, పాఠశాలలు మూసివేయటం కారణంగా వేలాది మంది విద్యార్థులకు, ఉపాధ్యాయలకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగాన్ని సంక్షోభంలోని నెట్టేస్తున్న నిర్ణయాలను మానుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఈనెల 21న, రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23న చేపట్టనున్న పోరాట కార్యక్రమాలను ఉపాధ్యాయలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకంలో పనిచేస్తున్న కెప్టెనన్(డ్రైవర్లు)ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షితంగా తల్లీబిడ్డలను చేర్చుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య,టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, సిబ్బంది కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

సముద్రంలో వ్యక్తి గల్లంతు