
లింగరాజు ఆలయంపై డ్రోన్ విహారం
భువనేశ్వర్: ఏకామ్ర క్షేత్రం లింగ రాజు ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యం స్థానికుల దృష్టికి వచ్చింది. ఈ సమాచారం ప్రసారం కావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ దేవస్థానంపై డ్రోన్ సంచారం పూర్తిగా నిషేధించినట్లు రాష్ట్ర పోలీస డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఇటీవల ప్రకటించారు. ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టే దృశ్యం గమనించిన వెంటనే ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. రాష్ట్రంలో నిషేధిత ఆలయ శిఖరాలపై డ్రోన్‌ల సంచారం తరచు చోటు చేసుకోవడం కలవరపరుస్తోంది. ఈ ఏడాది జనవరి 28న పూరీ శ్రీ జగన్నాథ ఆలయ శిఖరంపై నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించారు. శ్రీ మందిరం నీలచక్ర సమీపంలో డ్రోన్ దాదాపు 25 నిమిషాల పాటు చక్కర్లు కొట్టినట్లు స్థానికుల దృష్టికి వచ్చింది. అంతకు ముందు జనవరి 5న ఇటువంటి సంఘటన శ్రీ మందిరం శిఖరాన చోటు చేసుకుంది. తాజాగా స్థానిక లింగరాజు దేవస్థానం శిఖరంపై డ్రోన్ సంచారం రాష్ట్రంలో భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా నిలిచింది.