శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా.. అల్లర్లు, అలజడులు సృష్టించేందుకు యత్నించినా పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరించారు. నేరాల కట్టడిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఆదివారం వివిధ పోలీస్‌స్టేషన్లలో షీట్లు నమోదైనవారిని ఎస్‌హెచ్‌వోలు పిలిపించి మాట్లాడారు. నేర ప్రవృత్తి మాని సత్ప్రవర్తనతో మెలగాలని, కబ్జాలకు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడరాదని హితవుపలికారు. పేకాట డెన్‌లు నిర్వహించరాదని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించరాదని, అక్రమ రవాణా చేయరాదని చెప్పారు. కాగా, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్‌లో 39 మంది రౌడీషీటర్లుండగా, ఒకటో పట్టణ పరిధిలో 36 మంది ఉన్నట్లు సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు.
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యావ్యవస్థలో ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల వెన్నెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు భైరి అప్పారావు, తంగి మురళీమోహన్‌రావు, పప్పల రాజశేఖరరావు, దానేటి కేశవరావు, దుప్పల శివరాంప్రసాద్, సురేస్‌సింగ్, వెంకటరమణ, శ్రీనివాస్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష చిలకపాలేంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆదివారం నిర్వహించారు. మొదటి షిఫ్టులో 242 మందికి 239 మంది, రెండో షిఫ్టులో 242 మందికి 239 మంది హాజరయ్యారు
ఐక్యవేదిక ఉద్యమాన్ని
విజయవంతం చేయండి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఉద్యమాలలో ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి చిన్నబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కొన ఊపిరితో కొనసాగుతోందన్నారు. తొమ్మిది రకాల స్కూల్ వ్యవస్థతో గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని అనేక మంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని, పాతపద్ధతిలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వ్యవస్థలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, రేషనలైజేషన్‌లలో అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ అసిస్టెంట్లను ఎలిమెంటరీ పాఠశాలకు కేటాయించడం, రెండు మూడుసార్లు రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగకపోవటం, హైస్కూల్లో సెక్షన్‌కు 54 మందిని పరిగణించడం తగదన్నారు. ఐక్య వేదిక ఇచ్చిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర విద్యాశాఖలో జరుగుతున్న అసంబద్ధమైన, అస్తవ్యస్త నిర్ణయాల పట్ల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల విద్యార్థుల మానసిక, సృజనాత్మక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు


