దేవుడి పేరిట దోపిడీ
● పొనుటూరులో ఇసుక దందా ● ఒడిశాకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● వరద గట్టును సైతం తవ్వేసిన వైనం
కొత్తూరు:
దేవుడి పేరు చెప్పి మరీ అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ఆ నాలుగు గ్రామాల టీడీపీ నేతలకు దేవుడు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆలయాలు నిర్మిస్తున్నామంటూ పొనుటూరు పంచాయతీ పరిధిలోని పాతపొనుటూరు, పొనుటూరు కాలనీ, కొత్తపొనుటూరు, బంకి గ్రామాలకు చెందిన కొంత మంది నేతలు ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది.
కొత్తూరు మండలంలోని పాత పొనుటూరుకు అనుకొని ఉన్న వంశదార నదిలో అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లే ఆంధ్రా వాహనాల నుంచి రూ.200, ఒడిశా వాహనాల నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అసలే అక్రమ ర్యాంపు. ఆపై అక్రమ వసూళ్లు కావడంతో స్థానికులు కూడా నిశ్చేష్టులవుతున్నారు. గత 8 నెలలుగా ఈ దందా సాగుతోంది. నాలుగు గ్రామాలకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రెవెన్యూ, మైన్స్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది.
వాస్తవానికి ఆంధ్రా నుంచి ఇసుక ఒడిశాకు రవాణా చేయకూడదని నిబంధన ఉన్నా.. ఒడిశాకు చెందిన ట్రాక్టర్లతో పొనుటూరు నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు. ఒడిశాకు తరలిస్తున్న ట్రాక్టర్ నుంచి రూ. 500ను దేవుడి పేరుతో గుంజుకుంటున్నారు. సాక్షాత్తు గ్రామ సచివాలయం పక్క నుంచే అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇదే పంచాయతీ పరిధి బంకి గ్రామం నుంచి నదిలో ఇసుక అక్రమ రవాణా కోసం పూర్తిగా వరద గట్టును తవ్వేశారు. నదికి వరదలు వస్తే వరద నీరంతా పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా వంశధార ఇంజినీరింగ్ అధికారులకు పట్టడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని, అక్రమ ఇసుక రవాణా ఆపాలని కోరుతున్నారు.
●తగిన చర్యలు తీసుకుంటాను
పొనుటూరు వంశధారలో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చర్యలు తీసుకుంటాను. ఒడిశాకు ఇసుక తరలించకూడదు. దేవుడి పేరుతో అక్రమ వసూళ్లు చేయడం నేరం.
– కె.బాలకృష్ణ, తహసీల్దార్ కొత్తూరు
దేవుడి పేరిట దోపిడీ
దేవుడి పేరిట దోపిడీ


