జయపురం: సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితిలో ప్రజల తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు సమితి అధికారులు ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. ఈ టీమ్ సమితిలో గొట్టపు బావులు పాడైపోయిన ప్రాంతాలకు చేరుకొని పైప్‌లను బాగుచేసి ప్రజల తాగునీటి సమస్యలు తీర్చుతుందని బొయిపరిగుడ సమితి బీడీవో అభిమన్య కవి శతపతి, రూరల్ వాటర్ వర్క్స్ శానిటరీ విభాగ సమితి ఇంజినీర్ ప్రమోద్ కుమార్ సాహులు శనివారం తెలియజేశారు. సమితిలోని 20 గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాల మేరకు 2,200 బోర్లు తీయించామని వెల్లడించారు. వాటిలో 30 బోరింగ్‌ల నీటిమట్టం కిందకు దిగిపోయిందని, మరో 45 గొట్టపు బావులు పనిచేయడం లేదని వెల్లడించారు. వాటిని మరమ్మతులు చేయడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. బోరింగ్‌లతో పాటు సమితిలో 120 సోలార్ నీటి ప్రాజెక్టులు ఉండగా వాటిలో 10 పనిచేయడం లేదన్నారు. సోలార్‌తో నడిచే నీటి పంపుల నిర్వహణకు 58 మంది ఉద్యోగులను నియమించామని వెల్లడించారు. సమితిలో నీటి సమస్య లేకుండా చూచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.