కొరాపుట్: భూతల స్వర్గం దేవమాలిపై పాన్ ఇండియా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి హాట్ కామెంట్స్ చేశారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి దేవమాలి పర్వత ప్రాంతంపై ఎస్‌ఎస్‌ఎంబీ–29 చిత్ర షూటింగ్ పూర్తవ్వడంతో ఆయన తిరుగు ప్రయాణమైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇక్కడి అనుభవాలపై ఎక్స్ వేదికగా స్పందించారు. భూతల స్వర్గం వంటి దేవమాలిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి ప్రదేశంలో తన చిత్ర నిర్మాణం జరుపుకోవడం అద్భుతంగా ఉందన్నారు. తాను మరలా ఇక్కడ సినిమా షూటింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అక్కడికి వెళ్లే సందర్శకులు చెత్త పారవేయవద్దని సూచించారు. ఎవరు తీసుకొచ్చిన చెత్తను వారు వినియెగించిన తర్వాత, మరలా తామే తీసుకొని వెళ్లేవిధంగా సంచులు తెచ్చుకోవాలన్నారు. దేవమాలి పర్వతం మీద సందర్శకులు వదిలి వెళ్లిన చెత్త ఉన్న వీడియోని షేర్ చేశారు. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. వెంటనే ఇకపై దేవమాలిపై కొండపై చెత్త నివారించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా మరోవైపు షూటింగ్ జరిగిన ప్రాంతంలో ఏమైనా చెత్తని వదలి వెళ్లారో లేదో చూడడానికి కొందరు ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ సినిమా యంత్రాంగం యుద్ధ ప్రాతిప్రదికన మిగిలిన వ్యర్థాలను తొలగించడానికి జేసీబీలను ఏర్పాటు చేయడంతో అందరూ అభినందించారు.
దేవమాలి సంరక్షణ మనందరి బాధ్యత