ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌..

- - Sakshi

నిన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ కుగ్రామం.. ఊహకందని విషాదంతో అపఖ్యాతి మూట గట్టుకుంది. రాష్ట్ర చరిత్రలో రక్తాక్షరాలతో వందలాది మంది క్షతగాత్రుల హాహాకారాలకు వేదికై ంది. ఎటుచూసినా గుట్టులుగా పడి ఉన్న మృతదేహాలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తెగిపడిన అవయవాలు.. నిస్సహాయుల రోదనలు.. ఆప్తుల ఆర్తనాదాలతో బహనాగా బజార్‌ రైల్వేస్టేషన్‌.. భీతావహంగా కనిపించింది. – భువనేశ్వర్‌/కొరాపుట్‌/రాయగడ

హనాగా బజార్‌ స్టేషన్‌ ప్రాంతంలో జరిగిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటన స్థలంలో భయానక దృశ్యాలు హృదయాన్ని కలచి వేశాయి. దుర్మరణం పాలైన వారి మృతదేహాలు ఘటనా స్థలంలో గుట్టలుగా పడి ఉన్నాయి. బంధు, మిత్ర వర్గాలు కోల్పోయిన ఆత్మీయులను గుర్తించేందుకు వీలైన సదుపాయాలను కల్పించడంలో రైల్వేశాఖ పూర్తిగా విఫలమైన అమానుష దృశ్యాలు తారసపడ్డాయి. శుక్రవారం రాత్రి సుమారు 7గంటలకు ప్రమాదం సంభవించగా.. శనివారం సాయంత్రం వరకు ఘటనా స్థలంలో మృతదేహాలను సురక్షితంగా పదిల పరచలేకపోవడం దీనికి తార్కాణంగా చెప్పవచ్చు.

మృతదేహం సకాలంలో పదిల పరచకుంటే బాధిత కుటంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నా.. గుర్తించేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాధితులకు సకల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని మోదీ మొదలుకొని అన్ని స్థాయిల మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రకటించినా.. హామీలు నీటిమీద రాతలుగా తారసపడ్డాయి. ఎక్కడికక్కడ సహాయ కేంద్రాలు(హెల్ప్‌ డెస్క్‌) ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన ఘటనా స్థలం బహనాగ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో ఈ సదుపాయం వాస్తవంగా తారస పడకపోవడం విచారకరం.

స్వచ్ఛంద సేవలు అమూల్యం..
ఘటనా స్థలం పరిసరాల్లో స్థానికులు, సంస్థలు ఇతరేతర వర్గాలు బాధిత వర్గాలకు అందజేసిన వాస్తవ సహాయ సహకారాలు అమూల్యం. తాగునీరు, ఆహారం ఏర్పాట్లు నిరవధికంగా అందించి, ఆదుకున్నారు. బాలాసోర్‌, భద్రక్‌, కటక్‌ 3 జిల్లాల్లో పలు ఆస్పత్రుల్లో చేరిన బాధితులకు ఇదే తరహా సేవలతో ఆపత్కాలంలో బంధువులుగా ప్రత్యక్షమయ్యారు.

ఆచూకీ లేని లగేజీ..
ఘటనా స్థలంలో ప్రయాణికుల బ్యాగులు ఇతరేతర లగేజీ చిందరవందరగా పడి ఉంది. బాధితుల ఆచూకీ తెలుసుకోవడంలో అయిన వారు వర్ణనాతీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా దుర్మరణం పాలైన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

కటక్‌ ఎస్‌సీబీలో 193మంది భర్తీ
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దుర్ఘటనలో గాయపడిన 193మందిని కటక్‌ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. వీరిలో 9మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ఆస్పత్రి అత్యవసర అధికారి డాక్టర్‌ భువనానంద మహరణ తెలిపారు. చికిత్స కోసం భర్తీ అయిన వారిలో ముగ్గురు 18 ఏళ్ల లోపు యువకులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. దుర్ఘటన నేపథ్యంలో అత్యవసర వైద్య, చికిత్స సేవల కోసం ఆస్పత్రి నేత్ర చికిత్స వార్డు పైఅంతస్తులో అదనంగా 100 పడకలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

నా మిత్రుడు ఏమయ్యాడో?
రైలు దుర్ఘటనలో అనేక విషాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్పత్రులలో కోలుకుంటున్న వారు నెమ్మదిగా వాస్తవ పరిస్థితిలోకి వస్తున్నారు. ప్రస్తుతం భద్రక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సునీల్‌రామ్‌.. బీహార్‌కు చెందిన తన మిత్రుడు మనూ మహతో(25)తో కలిసి హౌరాలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కా రు. వీరిద్దరూ చైన్నె వెళ్లాల్సి ఉంది. కానీ ఈ దుర్ఘట న జరగడంతో విడిపోయారు. ప్రస్తుతం సునీల్‌ భద్రక్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనతో కలిసి ప్రయాణం చేసి తప్పిపోయిన మిత్రుడు ఆచూకీ కోసం ఆందరినీ అభ్యర్థిస్తున్నాడు.
– సునీల్‌రామ్‌, మోతుబరి, బీహార్‌

  స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని
రైలు ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు చేసిన సహాయం మరువలేనిదని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నయక్‌ కొనియాడారు. శనివారం ఉదయం ఘటన జరిగిన ప్రాంతాన్ని సలహాదారుడు 5టీ కార్తికేయ పాండ్యన్‌తో కలిసి సందర్శించారు. అప్పటికే చేరుకున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ శ్రీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలేశ్వర్‌ జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లిన సీఎం క్షతగాత్రులను పరామర్శించారు. స్థానికులు సకాలంలో ఆదుకోకపోతే తాము బతికి ఉండేవాళ్లం కాదని పలువురు బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆస్పత్రి రోదనలతో మిన్నంటడంతో సీఎం కాసేపు మౌనం వహించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ ఘటన ప్రాంతంలో స్థానికులు అందించిన సాయం మరువలేనిదని కొనియాడారు.

దారి మళ్లిన రైళ్లు..

రాయగడ: బహనాగలో చోటు చేసుకున్న

ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని

విశాఖపట్నం కోస్తారైల్వే పలు రైళ్లను దారి మచినట్లు ప్రకటించింది. భువనేశ్వర్‌, బాలేశ్వర్‌ మీదుగా ప్రయాణించాల్సి పలు రైళ్లు..

విశాఖపట్నం నుంచి విజయనగరం, రాయగడ, టిట్లాఘడ్‌, సంబల్‌పూర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. తదుపరి ఉత్తర్వులు

విడుదలయ్యే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు.

► బెంగలూర్‌–అగర్తల హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌(12503) టిట్లాఘడ్‌, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది.

► సిలిఘాట్‌–తంబారం(15630) రైలు రౌర్కెలా, టాట్లాఘడ్‌, విజయనగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

► పాట్నా–ఎర్నాకులం(62644) రైలు అంగూ ల్‌, విశాఖపట్నం మీదుగా చేరుకుంటుంది.

► దాఘా నుంచి విశాఖపట్నం(22873) చేరాల్సిన రైలు సంబల్‌పూర్‌, అనుగూల్‌ మీదుగా ప్రయానిస్తుంది.

► బెంగళూర్‌–గౌహతి(12509) ఎక్స్‌ప్రెస్‌ రైలు విజయనగరం, టిట్లాఘడ్‌, టాటానగర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

► సికింద్రబాద్‌–హౌరా(12704) రైలును తాత్కాలికంగా రద్దు చేశారు.

► గుణుపూర్‌–విశాఖపట్నం(08521) పాసింజర్‌ రైలు 3గంటలు ఆలస్యంగా విశాఖపట్నం చేరుకుంటుంది.

సీఎం నవీన్‌తో ఉదయనిధి స్టాలిన్‌ భేటీ
ముఖ్యమంత్రి నవీన్‌ పట్నయక్‌తో తమిళనాడుకు చెందిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ భేటీ అయ్యారు. ఆ రాష్ట్రమంత్రి ఎస్‌ఎస్‌ శివకుమార్‌తో కలిసి శనివారం రాత్రి భువనేశ్వర్‌లో నవీన్‌ నివాస్‌లో సంప్రదింపులు చేశారు. రైల్వే దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. 5టీ కార్యదర్శి కార్తికేయ పాండ్యన్‌ ప్రమాద వివరాలు ఉదయనిధికి వివరించారు. ఇదిలా ఉండగా.. ఘటన జరిగిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, మంత్రులు, అధికారులను ఘటనా స్థలానికి పంపించారు. చైన్నె నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి, క్షతగాత్రుల బంధువులు ఒడిశా చేరుకునే చర్యలు తీసుకున్నారు. ప్రమాద తీవ్రత పెరగడంతో స్టాలిన్‌ తన కుమారుడు ఉదయనిధిని నవీన్‌ వద్దకు పంపి.. సానుభూతి ప్రకగించారు.

ఆస్పత్రిని సందర్శించిన గవర్నర్‌..
రైలు ప్రమాదంలో గాయపడి భద్రక్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీలాల్‌ శనివారం పరామర్శించారు. వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు చికిత్స అందించాలని సూచించారు.

మంత్రి ప్రమీల మల్లిక్‌ పరామర్శ..
బహనగా రైలు ప్రమాద ఘటనలో గాయపడి బాలేశ్వర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ప్రమీల మల్లిక్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను సంబంధిత అధికారులు పంపిణీచేస్తున్నారు. ఇందులో భాగంగా సొరొ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.50 వేలు చొప్పున అందిస్తున్నారు.

రాజకీయాలకు సమయం కాదు: మమతా బెనర్జీ
అంతకుముందు వచ్చిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రోటోకాల్‌ పక్కన పెట్టి ప్రమాదం జరిగిన ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయాల సమయం కాదని, సహాయక చర్యల సమయంగా ప్రకటించారు. మృతులలో 60శాతం మంది బెంగాలీలు ఉన్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున్న పరిహారాన్ని బెంగాల్‌ ప్రభుత్వం అందజేస్తుందని ప్రకటించారు.

పరామర్శించిన కేంద్రమంత్రులు..
ఘటనా స్థలాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్‌, కేంద్ర విద్య, మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పరిశీలించారు. వీరివురూ ఒడిశా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంతరం ఇరువురూ కలిసి భద్రక్‌, బాలాసోర్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి, తెలుసుకున్నారు. సత్వర చికిత్స అందించాలని సూచించారు. వారితో పాటు కేంద్ర మాజీమంత్రి, బాలాసోర్‌ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి ఉన్నారు.

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top