ఎ.కొండూరు: జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో వచ్చే మూడు రోజులు చాలా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఆయన గురువారం ఎ.కొండూరు మండలం చీమలపాడులో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే పక్రియను పరిశీలించిన కలెక్టర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఫారాల డిజిటలైజేషన్ పనులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా డిజిటలైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం గ్రామంలో ఎరువుల షాపును కలెక్టర్ లక్ష్మీశ తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మండల వ్యవసాయాధికారి నాగరాజు నాయక్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ.కుమార్, తహసీల్దార్ ఎం.ఉదయభాస్కరరావు పాల్గొన్నారు.


