సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
సీహెచ్ బాబూరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల విద్యుత్ ప్రగతి నివేదిక అబద్ధాలు, అవాస్తవాలు, పాక్షిక సత్యాలతో కూడిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెంచలేదని, తగ్గించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ 24 నెలల కాలంలో ప్రతినెలా యూనిట్ విద్యుత్‌పై అదనంగా సర్దుబాటు చార్జీల భారం మోపారన్నారు. గురువారం విజయవాడలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దోనేపూడి కాశీనాథ్‌తో కలిసి సీహెచ్‌బాబూరావు మాట్లాడారు. ఇప్పటికీ రెండు రకాల అదనపు సర్దుబాటు చార్జీల వసూళ్లు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం రూ. 21,885 కోట్లు ట్రూ అప్, సర్దుబాటు చార్జీలు 24 నెలలుగా కూటమి ప్రజల ముక్కుపిండి మరీ వసూలు చేసిందన్నారు. చార్జీలు తగ్గించామని చెప్పుకునే ప్రభుత్వం ఇంకా సర్దుబాటు చార్జీలు ఎందుకు వసూలు చేస్తోందని నిలదీశారు. స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం మాట తప్పింది, నమ్మకద్రోహం చేసింది, అదాని సంస్థకు దాసోహం అంటోందని విమర్శించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల భారంపై, స్మార్ట్ మీటర్ల బిగింపుపై.. మంత్రి, కూటమి ప్రభుత్వం బహిరంగ విచారణకు సిద్ధం కాగలరా? అని సవాల్ విసిరారు. విద్యుత్ భారాలను రుజువు చేయడానికి సీపీఎం సిద్ధంగా ఉందన్నారు. చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేయాలని, చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఆపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


