కింకర్తవ్యం? | - | Sakshi
Sakshi News home page

కింకర్తవ్యం?

Jun 19 2026 2:18 AM | Updated on Jun 19 2026 2:18 AM

తలపట్టుకొంటున్న చంద్రబాబు సర్కారు లాకప్‌డెత్‌ ఘటన నుంచిప్రజల దృష్టి మళ్లించే యత్నం మరోవైపు ముమ్మరంగా రాజీయత్నాలు ఎలాగైనా సరే సద్దుమణిగేలా చేయాలని ప్రభుత్వ పెద్దల ఆదేశం

చంపేస్తారా...!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: విజయవాడ కృష్ణలంక యువకుడి లాకప్‌డెత్‌ ఘటన నుంచి బయట పడేందుకు చంద్ర బాబు కూటమి సర్కారు వేయని ఎత్తుగడ లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బాధితులను భయాందోళనలకు గురి చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ, ఆ ఘటనను తెరమరుగు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. లాకప్‌డెత్‌ జరిగిందని, ఓ వైపు పోలీసు వర్గాలే బాహాటంగా చర్చించుకొంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల్లో సైతం ఈ ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో కలకలం రేపింది. మన ప్రభుత్వంలో మన కాపులకే అన్యాయం జరుగుతోందని వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రశ్నించాల్సిన జనసేన రాజీ చేస్తుండటం దిగ్భ్రాంతి పరుస్తోందని వాపోతున్నారు. ఇందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతను రాయబారానికి పంపడమే సాక్ష్యమని ఎత్తి చూపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై భాదితులను సంతృప్తి పరిచేందుకు పోలీసు పెద్దలు ఇంకో అడుగు ముందుకు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. ఇంకా అవసరం అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా సాయం చేస్తారని భరోసా ఇస్తునట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి చనిసోయిన కుర్రాడికి రౌడీషీటర్‌ ముద్ర వేసి, అతనిని ఎన్‌కౌంటర్‌ చేసుంటే సరిపోయేదని, అదే జరిగి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఓ పోలీసు పెద్ద వ్యాఖ్యనించినట్లు చర్చ జరుగుతోంది.

తమదాకా రాకుండా...

తమదాకా రాకుండా పోలీసు స్థాయిలోనే కేసు క్లోజ్‌ కావాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ విషయానికి సంబంధించి ఏదైనా ఉంటే, డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడి నిర్ణయం తీసుకొండని మరోమారు సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. తూతూ మంత్రంగా కంటి తుడుపుగా సీఐని సస్పెండ్‌ చేసి, సమస్య తీవ్ర పెరగకుండా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, రాష్ట్రంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచక కర్తవ్యం ఏంటని, డిఫెన్స్‌లో పడింది. సాయికృష్ణ బతికి ఉంటే, సీఐను సస్పెండ్‌ చేయరని, రాజీయత్నాలకు ప్రయత్నించారనే భావన వ్యక్తం అవు తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటన నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక విలవిల్లాడుతోంది.

పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపడం, కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా కాల్చివే యటం ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న చర్చ. చంద్రబాబు, చినబాబు రెడ్‌బుక్‌ రాజ్యంగం నడుస్తోందని, దీంతో పోలీసులు రెచ్చి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహారించి నెలరోజులుగా హైడ్రామా నడిపి, సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపండం, కనీసం శవం ఇవ్వకుండా ప్రవర్తించడం వెనుక, రెడ్‌బుక్‌ అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పౌరుల ప్రాణాలకు రక్షణ లేదా, అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారు. కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేసే వరకు పోలీసుల్లో చలనం లేదని, ఈ విషయం అంతా సీఎం, డిప్యూటీ సీఎం, చినబాబుకు తెలియకుండా జరుగుతుందా ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు అండగా ప్రభుత్వం నిలవడంపై కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. లాకప్‌ డెత్‌ ఉదంతం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకనుందని, విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement