లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పి. శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు అన్ని వర్గాల పరిశ్రమలకు(రెడ్, ఆరెంజ్, గ్రీన్) అనుమతులు పొందేందుకు ఏపీఓసీఎంఎంఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉందన్నారు. చాలా పరిశ్రమలు దరఖాస్తులను పూరించేందుకు కన్సల్టెంట్‌లపై ఆధారపడుతున్నట్లు తెలిపారు. దీంతో దరఖాస్తులను పూర్తిగా పూరించకపోవడం, అవసరమైన పత్రాలను సమర్పించకపోవడంతో పరిశీలనలో జాప్యం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ పీసీబీ చైర్మన్, సభ్య కార్యదర్శి ఈ విషయాన్ని గమనించి దరఖాస్తుల పరిశీలనలో ప్రాంతీయ కార్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించినట్లు తెలిపారు. వారి ఆదేశాల మేరకు విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


