కిక్కిరిసిన కార్తికేయుని సన్నిధి
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం భక్తజనంతో పోటెత్తింది. ఆదివారం ఉదయం తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారికి ఒక రోజు వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,97,952 ఆదాయం వచ్చినట్లు ఆలయ డీసీ శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్లు ద్వారా రూ. 4,25,194, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 1,89,695, నిత్య అన్నదాన నిమిత్తం రూ. 1,20,085, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 74,500, శాశ్వత అన్నదానం కార్యక్రమ నిమిత్తం రూ. 50,256, కళ్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ. 22,360కలిపి మొత్తం రూ. 9,97,952లు ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): భవానీ దీక్ష విరమణల నిమిత్తం చేపట్టిన పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడితే ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని ఈవో శీనానాయక్ హెచ్చరించారు. దీక్ష విరమణలను పురస్కరించుకుని చేపట్టిన పనులను ఆదివారం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు పరిశీలించారు. క్యూలైన్లు, స్నానఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, లడ్డూ పోటు, హోమగుండాలు, ఇరుముడి సమర్పించే కేంద్రాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నారు. ఈవో వెంట ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లబ్బాయ్), రాఘవరాజు, దుర్గగుడి ఈఈ రాంబాబు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్ష విరమణలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు నియమితులయ్యారు. దీక్ష విరమణకు విచ్చేసే భవానీలకు మౌలిక సదుపాయాలు, ఏర్పాట్లను త్రినాథరావు పర్యవేక్షిస్తారు. గతంలో దుర్గగుడి ఇన్‌చార్జి ఈవోగా 15 నెలల పాటు బాధ్యతలు నిర్వహించిన అనుభవం త్రినాథరావుకు ఉంది. ఆ సమయంలో రెండు భవానీ దీక్ష విరమణలు, ఒక దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించారు.
తిరువూరు: భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం తిరువూరులో జరిగింది. 53వ మహాసభల సందర్భంగా జరిగిన కార్యవర్గ ఎన్నికలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా టి. కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడిగా కుమార్ నాయక్, ప్రణీత, ప్రణయ్, జిల్లా సంయుక్త కార్యదర్శులుగా ఖాజా, మాధవ్, ఉష, యశస్విని, మరో 11 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ తొలి సమావేశంలో తిరువూరు పట్టణంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలని, సంక్షేమ వసతిగృహాలకు భవనాలు నిర్మించాలని, పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేయాలి వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించారు.
కిక్కిరిసిన కార్తికేయుని సన్నిధి
కిక్కిరిసిన కార్తికేయుని సన్నిధి


