వారికి ప్రమోషన్ లేనట్టే!
వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగోన్నతులకు కసరత్తు 15 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న ఉన్నతాధికారులు లాబీయింగ్ మొదలు పెట్టిన ఉద్యోగ సంఘ నేతలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ఉద్యోగోన్నతులకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో ఎంతో కాలం నుంచి ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఉద్యోగోన్నతులు అనుమానమేనని ఆ శాఖ ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఖాళీలు ఇలా..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1, విజయవాడ–2, విజయవాడ–3 డివిజన్లుగా వాణిజ్య పన్నుల శాఖ పరిధి విస్తరించి ఉంది. ఈ మూడు డివిజన్లలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. వీటికి సంబంధించి 20 జీఎస్‌టీఓ పోస్టులు, ఎనిమిది సీనియర్ అసిస్టెంట్ పోస్టులు, 15 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగోన్నతులు ఇవ్వాల్సి ఉంది. జీఎస్‌టీఓలకు సంబంధించి 20 పోస్టుల్లో తొమ్మిది రెగ్యులర్ ప్రమోషన్లు, 11 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నుంచి భర్తీ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేకపోవటంతో ఆ ఖాళీలను సైతం తమకు కేటాయించి భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
శాఖపరమైన ఇబ్బందులు..
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు పలువురు శాఖపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారిని ఆయన కార్యాలయంలో ఘెరావ్ చేయటంతో సుమారు వంద మందికి పైగా మూడు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులపై ఆ శాఖ విచారణకు ఆదేశించింది. అందులో కొంతమందిని దోషులుగా తేల్చింది. ఆ విచారణ నివేదికపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో వారికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతి లభించే అవకాశం లేనట్టేనని అధికారులు చెబుతున్నారు.
లాబీయింగ్ షురూ..
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 17 సర్కిల్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో అడ్డంకిగా ఉన్న పలు ఆరోపణలను పూర్తిగా రద్దు చేసేందుకు ఉద్యోగ సంఘాల నేతలు లాబీయింగ్ మొదలు పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగోన్నతులకు ఎటువంటి అవరోధం లేకుండా చూస్తామని, దానికి చాలా నిధులు అవసరమని ఉద్యోగ సంఘాల నేతలు ఒకరిద్దరు ఉద్యోగులకు వివరిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. లాబీయింగ్ ప్రక్రియకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించి తమతమ స్థాయిల్లో మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న పుకార్లు ఆయా డివిజన్ కార్యాలయాల్లో షికారు చేస్తున్నాయి.
త్వరితగతిన పూర్తి..
ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు వాటికి సంబంధించిన విషయాలపై చర్చించి, నివృత్తి చేసేందుకు డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే ఇంత వేగంగా ఆ ప్రక్రియను పూర్తి చేస్తే చాలా మందికి ఉద్యోగోన్నతులు రాకుండా పోతాయని పలువురు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


