వైద్య రంగం ప్రైవేటీకరణతో సమాజానికి చేటు
ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్‌లో వక్తలు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేలా వైద్య వ్యవస్థ ఉండాలని, ఐక్యూతో ఎమోషనల్ మేనేజ్‌మెంట్ కూడా ఉన్నప్పుడే కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య వేదిక ఆరోగ్య సెమినార్‌లో పలువురు వక్తలు పేర్కొన్నారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో జన్ స్వాస్థ్య అభియాన్ వ్యవస్థాపకుడు డాక్టర్ అమిత్ సేన్ గుప్తా వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీనియర్ వైద్యుడు డాక్టర్ సూరపనేని సుధాకర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌లో ‘వైద్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు–పరిష్కారాలు, పెరుగుతున్న మానసిక సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశాలపై ఆరోగ్య సెమినార్ నిర్వహించారు.
ఎమోషనల్ మేనేజ్‌మెంట్ అవసరం..
ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని, ఇది ప్రమాదకరమైన సూచన అన్నారు. ఒకప్పుడు మద్యపానం, ధూమపానం ప్రధాన వ్యసనాలుగా ఉండేవని, ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరిగాయని, వాటి వల్ల యువత పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఎమోషనల్ మేనేజ్‌మెంట్ ద్వారానే వీటన్నింటినీ అధిగమించడం సాధ్యమన్నారు.


