న్యాయ విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు
పెనమలూరు: న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థులు నిరంతరం నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు సూచించారు. కృష్ణాజిల్లా, పెనమలూరు మండలం కానూరులోని సిద్ధార్థ లా కాలేజీ ఆధ్వర్యంలో చల్లా కొండయ్య మెమోరియల్ సిద్ధార్థ 4వ జాతీయ లీగల్ ఫెస్ట్–2025 ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. నిరంతర కృషితో విద్యార్థులు వృత్తిలో రాణించగలుగుతారన్నారు.
విద్యార్థులు పోటీ పడాలి..
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు నైపుణ్యం పెంచుకునేందుకు మూట్ కోర్టు మంచి వేదికన్నారు. జాతీయ స్థాయిలో అనేక కాలేజీలకు చెందిన విద్యార్థులు పోటీ పడటం వల్ల నైపుణ్యం పెరుగుతుందని, వృత్తిపై అవగాహన ఏర్పడుతుందన్నారు. మూట్ కోర్టులో ప్రథమ బహుమతి మంగుళూరు ఎస్‌డీఎం లా కాలేజీ, ద్వితీయ బహుమతి కేరళ కోజికోడ్ ప్రభుత్వ లా కాలేజీ గెలుచుకుంది. లీగల్ క్విజ్‌లో ప్రథమ బహుమతి సిద్ధార్థ లా కాలేజీ, అమరావతి స్కూల్ ఆఫ్ లా కాలేజీ గెలవగా, ద్వితీయ బహుమతి కేఎల్ యూనివర్సిటీ గెలుచుకుంది. బెస్ట్ మూటర్ ఇన్ మూట్ కోర్టు బహుమతి కోయంబత్తూర్ ప్రభుత్వ లా కాలేజీ, బెస్ట్ మెమోరియల్ ఇన్ మూట్ కోర్టు చైన్నెకి చెందిన స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ లా, డాక్టర్ అంబేడ్కర్ లా యూనివర్సిటీ గెలిచాయి. ఈ మేరకు గెలుపొందిన కాలేజీలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు, కాంటినెంటల్ కాఫీ కంపెనీ చైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


