సాయుధ దళాల సేవలు అజరామరం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సాయుధ దళాల నిధికి తోచిన సహాయం అందించి మాజీ సైనికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) పురస్కరించుకుని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇలక్కియ పతాక నిధికి విరాళం అందించారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుంచి పతాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సైనికులు, మాజీ సైని కులు, వారి కుటుంబ సబ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణకై పోరాడి, అసువులుబాసిన సైనికులకు నివాళులు అర్పించారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి.. జిల్లా ప్రజలు వ్యాపార వేత్తలు, పారిశ్రామిక వేత్తలు విద్యా సంస్థలు విరివిగా విరాళాలు అందించాలని ఇలక్కియ పిలుపునిచ్చారు.
పన్ను రాయితీ..
జిల్లా సైనిక సంక్షేమ అధికారి సర్జస్ లెఫ్టినెంట్ కమాండర్ కె. కల్యాణ వీణ మాట్లాడుతూ పతాక నిధికి అందించే విరాళాలకు ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందన్నారు. స్వచ్ఛందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, ఎన్టీఆర్ జిల్లా పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతా 62067742138 నంబర్ ఐఎఫ్‌ఎస్సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చని ఆమె తెలిపారు. విశ్రాంత ప్రిన్సిపాల్ కాళీ ప్రసాద్ పతాక నిధికి రూ. 25వేలు విరాళం ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియ


