చలనం లేదు.. చర్యలు లేవు!
కనీసం పలకరించలేదు..
భవానీపురంలో ఇళ్ల కూల్చివేతతో సర్వం కోల్పోయిన బాధితులు నిలువ నీడలేక అవస్థలు కనీసం పలకరించని అధికార పార్టీ నేతలు
రోడ్డున పడిన 42 కుటుంబాలను కన్నెత్తి చూడని టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం పేద కుటుంబాలపై కనికరం చూపకుండా నిర్థాక్షిణ్యంగా వ్యవహరించింది. కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి బలవంతంగా విజయవాడ భవానీపురం జోజినగర్‌లోని 42 ఇళ్లను నేల మట్టం చేసింది. పైసా, పైసా కూడబెట్టుకొని స్థలాలు కొనుగోలు చేసి, ఇళ్లు కట్టుకొన్న పేద, మధ్య తరగతి కుటుంబాలను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి విసిరేసింది. బాధితులను పరామర్శించి, న్యాయం జరిగేంత వరకు అండగా ఉండాల్సిన అధికార టీడీపీ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదప లేదు. ఆ ప్రాంతానికి వెళ్లి నష్టపోయిన ప్రజలను సమీకరించి ధైర్యం చెప్పి, పునర్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిన గురుతర బాధ్యత వారిపై ఉంటుంది. కానీ ఇప్పటి వరకు వారి జాడ కనిపించలేదు. దీంతో బాధితులు టీడీపీ నాయకుల తీరుపై మండిపడుతున్నారు.
సర్వం కోల్పోయాం..
ఏ చిన్న కార్యక్రమం జరిగినా హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడక పోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఇంట్లో సామానులు తీసుకోలేదని.. చిన్న పిల్లలకు పాలు ఇస్తున్నామని, కొంత సమయం ఇవ్వండయ్యా అంటూ, కాళ్లా వేళ్లా పడినా కనికరించకుండా, వారి గుండెల్లో గునపం గుచ్చడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రస్తుతం ఎక్కడ తలదాచుకోవాలో దిక్కు తెలియక విలవిల్లాడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితులతో సమావేశం అయినప్పటికీ ఆయన నుంచి కూడా భరోసా లభించలేదనే భావన వ్యక్తమవుతోంది.
అన్ని అనుమతులతో నిర్మించినా..
ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అన్నీ ప్రభుత్వ శాఖల అనుమతులతోనే జరిగాయి. ప్లాట్ రిజిస్ట్రేషన్, ఇంటి నిర్మాణానికి కావలసిన అనుమతులు, ఇంటికి అవసరమైన నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్, నిర్మాణం అనంతరం అంచనా వేసి, ఇంటి పన్ను నిర్ధారించడం ఇవన్నీ ప్రభుత్వ శాఖలు చేసే పనులే. ఇన్ని అనుమతులు తీసుకొని, 20 ఏళ్లకు పైగా అనుభవిస్తున్న ఇంటి యజమానుల ఇళ్లపై దాడిచేసి, ఏకకాలంలో 15 బుల్డోజర్లతో, 200 మందికి పైగా పోలీసులను మోహరించి 42 ఇళ్లను కూల్చివేయటంపై అన్ని వర్గాల ప్రజలు భగ్గుమంటున్నారు. విజయవాడలో వందల సంఖ్యలో అనధికారిక భవనాలు ఉన్నాయి. కోర్టులు సైతం భవనాలను కూల్చివేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. వాటిని పట్టించుకోని ప్రభుత్వ శాఖలు, ఒక ప్రైవేటు ఆస్తి విషయంలో ఇంత పెద్ద ఎత్తున జోక్యం చేసుకొ కూల్చివేతలకు పాల్పడటంపై సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది.
నా భర్త కోటేశ్వరరావు ఆర్మీలో పని చేసేవారు. ఆయన రిటైర్డ్ అయిన డబ్బులతో 1996లో స్థలం కొనుకున్నాం. ఎగుడు దిగుడుగా ఉన్న స్థలాన్ని చదును చేసుకొని, రేకుల షేడ్ నిర్మించుకున్నాం. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నాం. మాకు అది తప్ప ఇంకే ఆదరువు లేదు. దేశ రక్షణకోసం కష్టపడిన, మా గూటికే రక్షణ లేకుండా పోయింది. షెడ్డు కూల్చి వేయడంతో రోడ్డున పడ్డాం. కనీసం అధికార పార్టీ నాయకులు వచ్చి పలకరించిన పాపాన పోలేదు.
– చానం కనకదుర్గా, జోజినగర్ బాధితురాలు


