భక్తుల్లేకుండా కోటి దీపోత్సవం
ప్రభుత్వ ఆదేశాలతో ఇంద్రకీలాద్రి దేవస్థాన నిర్ణయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిన నిర్వహించే కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొనే అవకాశం లేదని దుర్గగుడి అధికారులు ప్రకటించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 5వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి కోటి దీపోత్సవం జరుగుతుంది. ఏటా కోటి దీపోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగిస్తారు. అయితే ఇటీవల రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం సమావేశమైన ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ వైదిక కమిటీ, ముఖ్య అధికారులు, పోలీసు అధికారులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అంతర్గత కార్యక్రమంగానే..
5వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమిన ఆలయంలో జరిగే దీపోత్సవాన్ని అంతర్గత కార్యక్రమంగా నిర్వహించాలని అధికారులు సూచించగా, వైదిక కమిటీ అంగీకారం తెలిపింది. ఆలయ వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు మాత్రమే దీపోత్సవాన్ని ఆలయ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలని నిర్ణయించారు. భద్రత రీత్యా ఈ కార్యక్రమంలో భక్తులెవరినీ అనుమించడం లేదని ఆలయ అధికారులు ప్రకటించారు. అదే విధంగా డిసెంబర్ 4న జరిగే కలశజ్యోతి ఊరేగింపు, దీక్ష విరమణలపై కూడా చర్చ సాగింది. అయితే ఆలయ అధికారుల నిర్ణయం, ప్రభుత్వ తీరుపై భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.


