అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్–2025లో భాగంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీజీ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభమైన విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ నవంబర్ రెండో తేదీతో ముగుస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, తిరుపతిల్లో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఫిర్యాదు చేయండి..
అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064కు కాల్ చేయవచ్చని ఏసీబీ డీజీ చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ వరకూ వెళ్లి తిరిగి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంది. ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయ లక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్


