
గీతాంజలి శర్మ గొప్ప కార్యశీలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పూర్వ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గొప్ప కార్యశీలి అని ఆ జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ కొనియాడారు. తన బాధ్యతలను అంకితభావంతో నెరవేర్చారని పేర్కొన్నారు. జేసీగా పనిచేసి బదిలీపై వెళ్తున్న సందర్భంగా గీతాంజలి శర్మకు సోమవారం రాత్రి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. భవిష్యత్తులో గొప్ప విజయాలను అందుకోవాలని కలెక్టర్ అభిలాషించారు. గీతాంజలి శర్మ మాట్లాడుతూ ఒక ఉద్యోగి చేసే ప్రతి పనికి సహకారం అందించడం తొలి నుంచే నేర్చుకున్నానని, దానినే తాను తిరిగి పొందానని అన్నారు. డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సర్వే ఏడీ జోషిలా, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పర్యాటక శాఖ జీఎం రామలక్ష్మణరావు, ఉద్యా న శాఖ అధికారి జె.జ్యోతి, ఆర్డీఓలు తదితర అధికారులు పూర్వ జేసీతో పని చేసిన నాటి అనుభూతులను ఈ సందర్భంగా పంచుకున్నారు. అనంతరం ఆమెను సత్కరించారు.
కార్మిక హక్కులు
కాలరాస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక హక్కులను కాలరాసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప, ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మండిపడ్డారు. కార్మికుల పని గంటలు పెంచుతూ.. రాత్రి వేళ మహిళా కార్మికులు పనిచేయాలంటూ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం చట్ట సవరణ చేయడాన్ని తప్పుబడుతూ వారు సోమవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడిదారులను సంతృప్తి పర్చడానికి కార్మిక వర్గంపై కూటమి ప్రభుత్వం ముప్పేట దాడి తీవ్రతరం చేయడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఏకతాటిపైకి వచ్చి ఐక్య సమరశీల పోరాటాలకు పూనుకోవాలని కేవీపీఎస్ నేతలు నల్లప్ప, మాల్యాద్రి విజ్ఞప్తి చేశారు.
పల్లెపాలెంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
కృత్తివెన్ను: మండల పరిధిలోని పల్లెపాలెం గ్రామంలో గత వారంరోజులుగా జ్వరపీడితుల సంఖ్య అధికం కావడంతో గ్రామంలో పరిస్థితిని జిల్లా మలేరియా అధికారి బి. రామారావు సోమవారం పరిశీలించారు. గ్రామంలో జ్వరపీడితుల గృహాలను సందర్శించి వారి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ పరిశీలన సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య పరీక్షల శిబిరం గురించి, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి వైద్యురాలు హేమను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సబ్‌యూనిబ్ అధికారి మురళీ, వైద్యులు సంతోష్‌కుమార్, డీవైహెచ్‌ఈవో ప్రభావతి, ఎంపీహెచ్‌ఎస్ రాజేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
కృష్ణలంక(విజయవాడతూర్పు): అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్(యూపీహెచ్‌సీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో యూపీహెచ్‌సీ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింహాచలం మాట్లాడుతూ యూపీహెచ్‌సీ ఉద్యోగులు డీఎస్సీ, ఆర్‌ఓఆర్ ప్రకారం విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల్లో తీవ్ర వ్యత్యాసం వల్ల అన్యాయానికి గురవుతున్నారన్నారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గౌరవాధ్యక్షుడు విజయ్‌కుమార్, రాష్ట్ర కన్వీనర్ రాజా రత్నరాజు, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.