అంతా తానే అవుతూ..
ఫేక్ లెటర్ల వెనుకా ఇతనే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: లాబీయింగ్‌లో లాలూచీ పర్వాల్లో మచిలీపట్నం పార్లమెంట్ ముఖ్యనేతది అందెవేసిన చెయ్యి! అయితే ఆయనకు రైట్ హ్యాండ్‌గా చెప్పుకొనే ఓ అనుచరుడు దందాల్లో ఆ ముఖ్యనేతనే మించిపోయారు. చిల్లర దొంగతనాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాల నుంచి, రేషన్ బియ్యం అక్రమ రవాణా వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దందాల్లో ఘనాపాటి వ్యవహార శైలిని చూసి టీడీపీ, జనసేన శ్రేణులే ‘శివ.. శివా..’ అంటూ నివ్వెరపోతున్నాయి.
గ్యాంగ్‌తో సెటిల్‌మెంట్లు..
రౌడీలు, గంజాయి బ్యాచ్, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు, నేరప్రవృత్తి గల వారితో నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని, సెటిల్‌మెంట్లు చేయడంలో సిద్ధహస్తుడిగా ఆ అనుచరుడికి పేరుంది. దొంగతనం కేసుల్లో పట్టుబడిన వారిని పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. ఆ కేసుల నుంచి తప్పించడం, ఫేక్ లెటర్‌లతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కరెంటు బిల్లు చెల్లించేందుకు అష్ట కష్టాలు పడిన ఇతను.. ఇప్పుడు అపర కుబేరుడిగా మారటం వెనుక అన్ని రకాల దందాలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న తాజా సంఘటనల్లోనూ ఇతని పేరు తెరపైకి వచ్చింది. తనకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు అందరితో సాన్నిహిత్యం ఉందని, తన మాటకు తిరుగే లేదని.. తాను ఎంత చెబితే, పార్లమెంటు మఖ్యనేత అంతే అంటాడని ప్రచారం చేసుకొంటూ, బరితెగించి దోపిడీకి పాల్పడుతున్నట్లు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది.
మైనర్ల దొంగతనాల కేసులోనూ..
ఇటీవల మైనర్ల దొంగతనాల కేసులో సైతం ఓ జనసేన నాయకుడిని పట్టు పట్టి కేసు నుంచి తప్పించినట్లు బందరులో జోరుగా చర్చ సాగుతోంది. చల్లపలిల్లో ఆక్రమించుకొన్న భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, రికార్డులు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు పరిధిలో భూ వివాదాల్లో తలదూర్చడం, ప్రైవేటు సైన్యంతో భయోత్పాతం సృష్టించి సెటిల్‌మెంట్లు చేస్తూ, రూ. కోట్లు కాజేస్తున్నట్లు తెలుస్తోంది.
బియ్యం మాఫియాలో ప్రధాన భూమిక..
ధాన్యం సేకరణలో రైతుల పేర్లతో ధాన్యాన్ని సేకరించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, వాటి స్థానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొన్నారు. ఈ మాఫియాలో మిల్లర్లను సిండికేట్ చేయడం, అధికారులను ఇబ్బందులు లేకుండా చూడటంలో ముఖ్యనేత అనుచరుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ముడుపులు ఇవ్వడం కోసం మిల్లర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలోనూ సగం కాజేస్తున్నారని సమాచారం. మిల్లర్లను రెండు వర్గాలుగా చీల్చి, ఆ రెండు వర్గాలను తన చెప్పు చేతల్లో పెట్టుకొని, ధాన్యం సేకరణలో భారీ ఎత్తున కొల్లగొడుతున్నట్లు వినికిడి. తనకు ఉన్న ట్రాక్టర్‌ల కంపెనీ నుంచి రైతుల పేరుతో రైస్‌మిల్లుల వారికి అక్రమంగా బిల్లులు క్రియేట్ చేసి ఇచ్చి దండుకొంటున్నట్లు సమాచారం. ఓ ధాన్యం వ్యాపారిపై ఇతను కత్తులతో దాడి చేయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుడివాడ రైల్వే ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ వద్ద కోటికిపైగా లంచం తీసుకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో కేడీసీసీ బ్యాంకులో తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.
పార్లమెంటు ముఖ్యనేత స్థాయిలో తన జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయాలని గంజాయి బ్యాచ్, రౌడీలతో కూడిన ప్రైవేటు సైన్యానికి హుకుం జారీ చేయడంతో గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, ఉయ్యూరు, పెనమలూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కటౌట్‌లు, ఫ్లెక్సీలతో హంగామా చేశారు. దీనిని చూసిన ఆ పార్లమెంట్ ముఖ్యనేత సైతం నివ్వెరపోయి, ‘ఏంటిరా నాకు పోటీ వచ్చేటట్టున్నావే’ అంటూ చురకలు వేసినట్లు జనసేన వర్గాలు చర్చించుకొంటున్నాయి.
గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డల్లో ప్రత్యేక అనుచరగణం రౌడీలు, గంజాయి, నేర ప్రవృత్తి గల వారితో ముఠా ఏర్పాటు ఇటీవల ఫేక్ లెటర్‌లతో ఉద్యోగాల వెనుక అతడే ఉన్నట్లు అనుమానం రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అంతా తాను చెప్పినట్లే వింటారని బిల్డప్ ధాన్యం సేకరణలో మిల్లర్లతో కలిసి అడ్డదారులు
ఇటీవల కృష్ణా జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగ యువత నుంచి, కోటి రూపాయలు వసూలు చేశారు. సంతకాలను ఫోర్జరీ చేసి, సిఫారసు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యనేత అనుచరుడే చక్రం తిప్పినట్లు మోసపోయిన నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక లెటర్‌లో సంతకం ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందని, 60మందికి పైగా లెటర్లలో ఫోర్జరీ చేయడం సాధ్యం కాదని, దీనిని బట్టి చూస్తే, ఆ ముఖ్య నేతకు కూడా దీనిలో సంబంధం ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. దీనికితోడు ముఖ్యనేత కార్యాలయంలో పని నుంచి తొలగించామని చెబుతున్న వ్యక్తిని పార్లమెంటు ముఖ్యనేత అనుచరుడు విజయవాడలోని తన వ్యాపార సముదాయాల్లో పనిలో ఉంచుకోవడంపైన ఈ దందాలో అనుచరుడి పాత్ర ఉందనే అనే దానికి బలం చేకూర్చుతోంది. ఆ ముఠాలో మొవ్వ మండలం మువ్వపాలెంకు చెందిన పార్లమెంటు ముఖ్యనేతకు తలలో నాలుకగా మెలిగిన ‘కాకా’లాంటి జనసేన నాయకుడు ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వా లని 8 మంది నిరుద్యోగులు ఇటీవల విజయవాడలోని ఆయన ఇంటి చుట్టుముట్టడం సంచలనం రేపింది. ఆ డబ్బుల్లో కూడా ముఖ్యనేత అనుచరుడికి వాటా ఉన్నట్లు చెబుతున్నారు.
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దందాల పర్వం
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దందాల పర్వం
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దందాల పర్వం