
కాకినాడ రీజియన్‌లో డీఆర్‌ఎం ప్రత్యేక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా ఆదివారం కాకినాడ రీజియన్‌లో భద్రత, సరుకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై సమగ్ర తనిఖీలు చేశారు. కాకినాడ స్టేషన్, కాకినాడ పోర్టు, కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌లను సందర్శించి సరుకు రవాణా నిర్వహణ, భద్రత, సిబ్బంది మౌలిక సదుపాయాలపై తనిఖీలు నిర్వహించారు. ముందుగా కాకినాడ టౌన్‌లో జరుగుతున్న ఐఓహెచ్ (ఇంటర్మీడియెట్ ఓవర్‌హాల్) షేడ్ పనులపై అధికారులతో సమీక్షించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాను పరిశీలించారు. అనంతరం రన్నింగ్ రూమ్‌ను పరిశీలించారు. సిబ్బంది సంక్షేమానికి డివిజన్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని, రన్నింగ్ రూమ్‌లో పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్‌బుక్ వ్యవస్థలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు చేరుకుని గూడ్స్ సైడింగ్, ప్రైవేటు టెర్మినల్స్‌లలో సరుకు రవాణా నిర్వహణ కార్యకలాపాలపై అక్కడి అధికారులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు డివిజన్ నెట్‌వర్కులో కీలకమైన సరుకు రవాణా కేంద్రం అని, కేఎస్‌పీఎస్ సమన్వయంతో యార్డ్ లేఅవుట్, షంటింగ్ నమూనాలు, వేగవంతమైన వ్యాగన్ల నిర్వహణపై సమీక్షించి అధికారులు పలు మార్గదర్శకాలు చేశారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక ఆధారిత పద్ధతులను అవలంభిస్తూ సురక్షిత రైళ్ల నిర్వహణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో ఆపరేటింగ్, మెకానికల్, కమర్షియల్, భధ్రత విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.