
ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. స్వచ్ఛ విజయవాడ సాధనలో భాగంగా ఆదివారం సాయంత్రం భవానీపురంలోని హరిత బెరంపార్క్‌లో సంప్రదాయ నృత్య పోటీలను ఆయన మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నగరంలోని ఔత్సాహిక నృత్య కళాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణపై తరచూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వివిధ కళారూపాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా వరుసగా ఐదు ఆదివారాల నృత్య పోటీలు ఇక్కడ జరుగుతాయని తెలిపారు. చివరి ఆదివారం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, మారిటైం బోర్డ్ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ బెరంపార్క్‌లో నృత్య ప్రదర్శన పోటీలు ప్రారంభం