ఎముకల పటుత్వం తగ్గుతోంది.. | - | Sakshi
Sakshi News home page

ఎముకల పటుత్వం తగ్గుతోంది..

Aug 4 2025 5:20 AM | Updated on Aug 4 2025 5:20 AM

ఎముకల

ఎముకల పటుత్వం తగ్గుతోంది..

లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవుల్లో ఎముకల పటుత్వం తగ్గుతోంది. ఎముకల గూడే మనిషి నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది. వడివడిగా అడుగులు పడాలన్నా, చకచకా పనులు సాగాలన్నా ఎముకలే కీలకం. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్లు ఎముకల పటుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ఎముకలు గుల్లబారడం, కీళ్లు అరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 4 జాతీయ బోన్‌ అండ్‌ జాయింట్‌ డే సందర్భంగా ఎముకలు పటిష్టగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం..

చిన్న దెబ్బకే ఎముకల ఫ్యాక్చర్‌

ఎముకల పటుత్వం తగ్గిన వారికి చిన్న దెబ్బకే బోన్స్‌ ఫ్యాక్చర్‌ అవుతున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుతున్న వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. అందుకు ఎముకలు గుల్లబారడం, విటమిన్‌ డి లోపంతో పాటు, ఆర్థరైటిస్‌ కూడా కారణంగా చెబుతున్నారు.

ఇవే నిదర్శనం

● పటమటకు చెందిన రమణయ్యకు 55 ఏళ్లు. ఒకరోజు ఇంటి గుమ్మం దాటుతూ ముందుకు పడ్డాడు. తుంటెకీలు విరగడంతో ఆస్పత్రిలో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎముకలు పటుత్వం కోల్పోవడమే కారణంగా తేల్చారు.

● 42 ఏళ్ల భారతికి ఏడాదిగా మోకీలు వద్ద నొప్పి వస్తోంది. ఆస్పత్రికి వెళ్లగా, ఎముకల్లో అరుగుదల ప్రారంభమైందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి.

శారీరక శ్రమ లేకే..

ఒకప్పుడు మహిళలు పిండి రుబ్బడం, దుస్తులు ఉతకడం, బావినీళ్లు చేదడం వంటి ఇంటి పనులతో మహిళలకు వ్యాయామం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మగ వారిలో సైతం వ్యా యామం ఉండటం లేదు. శరీరానికి సూర్యకిరణాలు తగలకపోవడం వంటి కారణాలతో ఎముకల్లో సాంధ్రత తగ్గిపోతుంది. చిన్నవయస్సు వారిలో పటుత్వం ఉండటం లేదు.

పటుత్వం తగ్గడానికి కారణాలివే

● ఆహారంలో తగు పాళ్లలో కాల్షియం, విటమిన్‌ డి. ప్రొటీన్లు లోపించడం

● నిశ్చల జీవనశైలి (శారీరక శ్రమ లేక పోవడం), మద్యపానం, ధూమపానం

● అధికంగా కాఫీ, శీతలపానీయాలు తాగడం

● అధిక మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడటం

● మహిళల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ లోపమే కారణం

ఏమి చేయాలి

● ఎముకల నిర్మాణంలో కాల్షియం చాలా కీలకం. సాధారణ వ్యక్తులకు 650 మి.గ్రాల కాల్షియం అవసరం. దీనికి పాలు, మజ్జిగ, చీజ్‌ తగినంత తీసుకోవడం మంచిది.

● మనం తీసుకున్న ఆహారం వంటబట్టడానికి విటమిన్‌ డి అవసరం. అందుకు ప్రతి రోజూ కాస్త ఎండలో ఉండటం మంచిది.

● అన్నిటి కంటే ముఖ్యమైనది వ్యాయామం. నిశ్చల జీవనశైలిలో ఎముక కండరం మోతాదు చాలా వేగంగా తగ్గిపోతుంది. వ్యాయామం, శారీరక శ్రమతో కాపాడుకోవచ్చు.

● తగినంత ప్రొటీన్‌ తీసుకోవడం చాలా ముఖ్యం. గరిష్టంగా మన శరీర బరువులో కేజీకి ఒక గ్రాము ప్రొటీన్‌ తీసుకోవాలి. మన దేశంలో 0.5 గ్రాము ప్రొటీన్‌ మాత్రమే తీసుకుంటున్నారు.

కాల్షియం, విటమిన్‌ డి లోపం వల్లే

చాప కింద నీరులా ఆస్టియో ఫ్లోరోసిస్‌

మధ్య వయస్సులోనే కీళ్లు అరుగుతున్న వైనం

రోగుల్లో మహిళలే ఎక్కువ

నేడు జాతీయ బోన్‌ అండ్‌

జాయింట్‌ డే

ఆరోగ్య వంతమైన జీవనశైలి అవసరం

ఆరోగ్యవంతమైన జీవనశైలితోనే ఎముకలను పటిష్టంగా ఉంచుకోవచ్చు. కాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్లు, పెరుగు, చేపలు, రాగులు, పండ్లు ఆహారంగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ధూమ, మద్యపానం, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. మా వద్దకు చిన్న వయస్సులోనే కీళ్ల అరుగుదల ఉన్న వారు వస్తున్నారు. అలాంటి వారికి అత్యాధునిక విధానాలతో కీళ్ల మార్పిడి చేస్తున్నారు. రోబోటిక్‌ కీళ్ల మార్పిడిని అందుబాటులోకి తెచ్చాం.

–డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు

ఎముకల పటుత్వం తగ్గుతోంది.. 1
1/1

ఎముకల పటుత్వం తగ్గుతోంది..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement