
మాటల్లో కోటలు.. చేతల్లో కోతలు
కంకిపాడు: అన్నదాతల విషయంలో పాలకుల మాటలు కోటలు దాటితే.. చేతల్లో మాత్రం కోతలే అన్న విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు క్షేమాన్ని విస్మరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ రైతులందరికీ రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని నాడు కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ రూ.20 వేలు సొమ్ములో కేంద్రం వాటా రూ.6 వేలతో పాటుగా మొత్తం మూడు విడతలుగా ఇస్తామంటూ కూటమి మాట మార్చేసింది. పథకంలో అర్హుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గించడంతో దుఃఖమే మిగిలిందంటూ అన్న దాతలు వాపోతున్నారు.
తగ్గిన అర్హుల సంఖ్య
కూటమి ప్రభుత్వం రైతులను ఆది నుంచీ విస్మరిస్తూనే ఉంది. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో మాట మార్చిన కూటమి పాలకులు ఇప్పుడు పథకానికి అర్హులైన రైతుల సంఖ్యలోనూ కోత విధించింది. కృష్ణా జిల్లాలో1.74 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. సుమారు 1.86 లక్షలు మందికి పైగా రైతులు ఉన్నారు. వివిధ కారణాలతో 1,484 మందికి సంబంధించిన ఈకేవైసీ తిరస్కరించారు. 2,300 మందికి పైగా రైతులు పెండింగ్‌లో ఉన్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్నుదారులు, ఇతరత్రా వారిని మినహాయించి జిల్లాలో 1,34,488 మంది రైతులు ఉన్నారని, 1,30,626 మందిని అర్హులుగా తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.66.93 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.22.73 కోట్లు వెరసి రూ.89.66 కోట్లు తొలివిడత రైతుల ఖాతాకు చేరాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపులు, ఇతరత్రా కారణాలను సాకుగా చూపి వడపోత ప్రక్రియ ద్వారా అర్హుల సంఖ్య భారీగా తగ్గించడం గమనార్హం.
తొలి ఏడాది ఎగనామం
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వరదలు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. పరిహారం విషయంలోనూ కోతలు విధించడంలో బాధిత రైతులకు పూర్తి న్యాయం జరగలేదు. ఆఖరికి ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా అన్నదాత సుఖీభవను అమలుచేయలేదు. తొలి ఏడాదిలోనే జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం చూసినా సుఖీభవ సొమ్ము రూ.300 కోట్లు మేర రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఒకే విడతలో సాయం అందుతుందని రైతులు భావించారు. మూడు విడతలు అంటూ మాట మార్చడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు చాలా మంది రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేలు మాత్రమే జమైందిగానీ, రాష్ట్రం వాటా సొమ్ము రూ.5 వేలు జమకాకపోవటంతో ఇదెక్కడి సుఖీభవ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలోనే రైతు సంక్షేమం
ప్రచారంపై ఉన్న శ్రద్ధరైతులపై లేదు
కూటమి ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తోంది మరొకటి. ఒకే పర్యాయం డబ్బులు విడుదల చేసినట్లయితే పెట్టుబడులకు ఉపయోగపడేది. విడతల వారీగా విడుదల చేయడంతో ప్రయోజనం ఏముంటుంది?.
–జంపాన శ్రీనివాసగౌడ్, రైతు, గురజాడ
కౌలురైతులకు మొండిచెయ్యి
రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు మంది సంఖ్య తగ్గింది. ఆదాయ పన్ను చెల్లింపు, ఇంకేదో కారణాలతో అర్హుల సంఖ్య కుదించారు. కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. ఎన్నికల హామీ మేరకు సాగుదారులందరికీ వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించాలి. కష్టపడి వ్యవసాయం చేస్తున్నందుకు ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంది. అక్టోబరులో కౌలురైతులకు ఇవ్వడంతో ఉపయోగం ఏంటి?, కౌలురైతులు అప్పులు చేసి, వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. కౌలురైతులకు ఒకేసారి రూ.20 వేలు ఇవ్వాలి.
–మాగంటి హరిబాబు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అన్నదాతకు దుఃఖం
రైతు సంక్షేమంలో కూటమి విఫలం
పేరుకేమో రూ.20వేలు పెట్టుబడి సాయం
మూడు విడతలుగా సొమ్ము అందజేతకు ప్రణాళిక
అర్హులైన రైతుల సంఖ్య కుదింపు
వైఎస్సార్ సీపీ హయాంలో అన్నదాతకు భరోసా
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి బాటలు పడ్డాయి. ఇచ్చినమాటకు అనుగుణంగా రైతులకు రైతు భరోసా సొమ్ము జమ చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. జిల్లాలో 2019–20లో 1,31,595 మందికి రూ.108.09 కోట్లు, 2020–21లో 1,44,280 మందికి రూ.110.82 కోట్లు, 2021–22లో 1,50,099 మందికి రూ.115.00 కోట్లు, 2022–23లో 1,52,112 మందికి రూ.118.74 కోట్లు, 2023–24 సంవత్సరానికి అత్యధికంగా 1,56,827 మందికి రూ.122.55 కోట్లు రైతుభరోసా అందించి రైతుపక్షపాత ప్రభుత్వం అని నిరూపించింది. కౌలు రైతులకు కూడా ‘భరోసా’ ఇచ్చింది.

మాటల్లో కోటలు.. చేతల్లో కోతలు

మాటల్లో కోటలు.. చేతల్లో కోతలు