
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్‌లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. క్యూలైన్లలో కూలర్లు ఉన్నా వాటికి కేవలం ఫ్యాన్లుగానే వినియోగించడంతో ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. చంటి పిల్లలతో ఉన్న వారు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ