
చీమలపాడులో జ్వరాలపై ఇంటింటి సర్వే
తిరువూరు: విష జ్వరాలు ప్రబలుతుండటంతో ఎ.కొండూరు మండలం చీమలపాడులో మంగళవారం జిల్లా మలేరియా అధికారి మోతీబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటి సర్వే నిర్వహించాయి. గ్రామంలో మంచినీటి సరఫరాలో నాణ్యతను వైద్య బృందాలు విస్తృతంగా తనిఖీ చేయాలని, జ్వర పీడితుల వివరాలను నమోదు చేసి ప్రత్యేక వైద్య శిబిరాల్లో చికిత్స అందించాలని మోతీబాబు సూచించారు. చీమలపాడు, కేజీ తండాలలో రోగుల వివరాలను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు ప్రబలే అవకాశం ఉందని, దోమ కాటుతో జ్వరాల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర కన్సల్టెంట్ రామచంద్రుడు, హరి, ఎ.కొండూరు పీహెచ్‌సీ వైద్యాధికారులు స్వాతి, దివ్య, ఆరోగ్య, ఆశావర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.